‘జబర్దస్త్’ (Jabardasth) అంటే నాగబాబు (Naga Babu) , రోజా (Roja).. చాలా ఏళ్ల పాటు ఇదే జరిగింది. అయితే నాగబాబు ఇలా బయటకు వెళ్లడం ఆలస్యం.. చాలా మార్పులు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో జడ్జి మారారు. చాలా రోజులుగా ఉన్న కృష్ణ భగవాన్ (Krishna Bhagavaan) ప్లేస్‌లోకి కొత్త వ్యక్తిని తీసుకొచ్చింది ఈటీవీ – మల్లెమాల టీమ్. అయితే వెళ్లిపోయిన / పంపించేసిన జడ్జికి స్నేహితుడినే ఇప్పుడూ తీసుకొచ్చారు. ఈ వారం వచ్చిన కొత్త ప్రోమోలో ఆ జడ్జిని చూడొచ్చు కూడా.
సింగర్ మనో (Mano) జడ్జిగా చేసి వెళ్లిపోయాక చాలామందిని ప్రయత్నించిన జబర్దస్త్ (Jabardasth) టీమ్.. కృష్ణభగవాన్ దగ్గర స్టిక్ అయింది. చాలా ఎపిసోడ్లు ఆయన చేశారు. జబర్దస్త్ ఫార్మాట్ మార్చాక కూడా ఆయననే కంటిన్యూ చేశారు. అంటే గురువారం ఎపిసోడ్ చేసే ఇంద్రజను (Indraja) పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ఆయన ప్లేస్‌లో యాక్టర్ శివాజీని (Sivaji) తీసుకొచ్చారు. కెరీర్ తొలి రోజుల్లో బాగానే కామెడీ చేసిన ఆయన.. ఇప్పుడు సీరియస్‌గా మారారు.
అయితే, ఇప్పుడు ఆయన్ను కామెడీషోకి (Jabardasth) జడ్జిగా తీసుకొచ్చారు. దీంతో కార్యక్రమం ఎలా ఉండబోతోంది అనే డౌట్ వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చీ రాగానే పంచ్‌లు, కౌంటర్లు, రిటర్న్ కౌంటర్లు వేసి తనలో ఆ కామెడీ టైమింగ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పకనే చెప్పేశారు. తన మీద జోకులు వేసినప్పుడల్లా ‘నేను పోతాను అన్నయ్యా నేను పోతాను’ అని సీటు లోనుంచి లేచి తనదైన శైలిలో కౌంటర్లు వేసి నవ్వించే ప్రయత్నం చేశారు శివాజీ.
అయితే, గత కొన్ని నెలలుగా ఉన్న కృష్ణ భగవాన్‌ను ఎందుకు తప్పించారు? లేదంటే ఆయనే తప్పుకున్నారా? అనేది తెలియదు. ఇక పైన చెప్పినట్లుగా శివాజీ, కృష్ణభగవాన్ మంచి స్నేహితులు. గతంలో ఇద్దరూ కలసి సినిమాల్లో నటించారు. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ తదితర సినిమాల్లో ఇద్దరి టైమింగ్ పంచులు భలే ఉంటాయి.