హరీష్ కూడా కొన్ని నెలల వరకు అనుకోని ఉండడు, తాను మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడు అని. అందుకు నిదర్శనం ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు. గద్దలకొండ గణేష్ మూవీ ప్రెస్ మీట్ లో విలేకరులు పవన్ తో మూవీ చేస్తున్నారట కదా అని అడిగితే, అది మీరే చెప్పాలి, చెయ్యాలని నాకు ఉంది, అది జరిగే పని కాదు, జరగాలని దేవుణ్ణి కోరుకుందాం అని అన్నారు. అంటే కొన్ని నెలల ముందు వరకు కూడా పవన్ ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని హరీష్ భావించలేదు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల రీత్యా ఆయన మళ్ళీ ముఖాన్ని రంగు వేసుకుంటారని ఎవరు భావించలేదు. ఇక గత రెండు నెలలుగా దీనిపై స్పష్టత రాగా, చక చకా సినిమాలు ప్రకటించేశారు. పింక్ రీమేక్, క్రిష్ మూవీ గురించి గతంలోనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వారు ముందుగానే పవన్ కొరకు స్క్రిప్ట్ సిద్ధం చేసిపెట్టుకున్నారు. మరి హరీష్ పరిస్థితి ఏమిటి అనేది తెలియాలి.
ఇంత సడన్ గా పవన్ తో మూవీకి దర్శకుడు హరీష్ ఎలా నిర్మాతలను ఒప్పించాడు అనేది ఆసక్తికరంగా మారింది.ఇక నేడు హరీష్ పవన్ తో ఆయన చేస్తున్న మూవీ రీమేక్ కాదని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఎప్పుడో పవన్ కోసం సిద్ధం చేసుకున్న కథను వారికి వినిపించి ఒప్పించాడా? ఓ లైన్ వినిపించి డెవలప్ చేస్తాను అని చెప్పారా అనేది తెలియాలి. ఎందుకంటే పవన్ సినిమాలు చేస్తారు అని తెలిసిందే కొన్ని నెలల ముందు, ఇంత తక్కువ సమయంలో స్క్రిప్ట్ సిద్ధం చేయడం అనేది జరగనిపని, మరో ప్రక్క రీమేక్ కాదంటున్నారు. కాబట్టి పాత కథకు మెరుగులు దిద్దుతున్నాడా లేక, కొత్త కథను ఆ రెండు సినిమాలు పూర్తి అయ్యేలోపు వండబోతున్నాడా? అనే అనుమానం కలుగుతుంది. ఒక వేళ ఇప్పుడు స్క్రిప్ట్ మొదలుపెట్టే క్రమంలో పూర్తి స్క్రిప్ట్ వినకుండా ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మాతలు ధృవీకరిస్తారా…? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చూడాలి మరి హరీష్ తన డ్రీమ్ హీరో కోసం ఎలాంటి కథతో వస్తారో.