సినిమా ప్రచారం ఎప్పటికప్పుడు కొంత పుంతలు తొక్కుతూనే ఉంటుంది. కాలానికనుగుణంగా మారాలి కూడా. పోస్టర్, ప్రీ లుక్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, కాంటెస్ట్ ఇలా సినిమా ప్రచారానికి రకరకాల రూపాలున్నాయి. ఇవి కాకుండా సినిమా కథకు అనుగుణంగా ఆడియో విడుదలలో కొన్ని స్కిట్స్ చేస్తుంటారు. అయితే ఇటీవల మరో కొత్త పధ్ధతి మొదలయ్యింది. అదే ప్రత్యేక ప్రదర్శనలు.
గతేడాది పూరి తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా మహిళలకు ప్రత్యేకంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న సుప్రీమ్ సినిమాలో దివ్యాంగులతో చిత్రీకరించిన ఓ పోరాట సన్నివేశం మూలంగా దివ్యాంగులందరికీ వారితోపాటు వెళ్లిన ఒకరికి ఉచితంగా ప్రదర్శించారు. ఇప్పుడు హైపర్ సినిమా కూడా ఇదే పద్దతిని అనుసరిస్తోంది. ఈ సినిమాలో ప్రభుత్వోద్యోగుల సంతకానికి ఉండే విలువ గురించి ప్రస్తావించారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తీర్చిదిద్దిన సన్నివేశాలకు అబ్బూరి రవి రాసిన మాటలు మరింత బలం చేకూర్చాయి. ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అయిపోయాయి. అంచేత దాన్నీ ప్రచారాంశంగా వాడుకోవాలని చిత్ర బృందం నిశ్చయించుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారట. అయితే సినిమా లాభాల బాట పట్టడానికి ఇదెంతవరకు కారణమవుతుందో..?