సినిమానే శ్వాసగా, ధ్యాసగా బతికే తెలుగు దర్శకుల్లో ఎస్.ఎస్.రాజమౌళి తొలి స్థానంలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా విజయం సాధించింది. ఒక సినిమా రికార్డ్స్ ని మరో సినిమా బీట్ చేసింది. దర్శకధీరుడు ఈగ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమా సామాన్యులకు కాదు.. సినీ సెలబ్రిటీలకు నచ్చింది. ప్రాంతం, భాష అని తేడా లేకుండా చాలామంది సీనియర్ టెక్నీషయన్లు జక్కన్నకు అభిమానులుగా మారిపోయారు. విదేశాల్లోనూ రాజమౌళికి అభిమానుల సంఖ్య పెరుగుతోంది. నైజీరియాకు చెందిన మహిళా దర్శకురాలు టోపె ఓషిన్ ఇటీవల బాహుబలి సినిమాను చూసి సోషల్ మీడియా వేదికపై స‍్పందించారు.“బాహుబలి రెండు భాగాలను మార్చి మార్చి చూసాను. ఎలా స్పందించాలో అర్థం కావటం లేదు. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్. సినిమా చూస్తున్నప్పుడు నాకు బాధ, ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం కలిగాయి. నా మీద బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. బాహుబలి సినిమా కోసం ఎంత సమయమైనా కేటాయించవచ్చు అందుకే స్క్రిప్ట్, ఎడిటింగ్ లాంటి పనులున్నా పక్కన పెట్టి సినిమా చూశాను. నేను మళ్లీ బాహుబలి గురించి ట్వీట్ చేయకుండా ఉండలేనేమో” అని ట్వీట్ చేశారు. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శిస్తున్న బాహుబలిని ఆలస్యంగా చూసిన వారు సైతం రాజమౌళికి అభిమానులయిపోతున్నారు.