ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువమంది మంచిగా మాట్లాడితే అందుకు బలం పెరుగుతుంది. అదే ఎక్కువమంది ఖండిస్తే అది బలహీనపడుతుంది. అలాగే ఎప్పటి నుంచో సినీ పరిశ్రమలో పాతుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువమంది స్పందించి దానిని బలహీనం చేస్తున్నారు. సీనియర్, జూనియర్ అని సంబంధం లేకుండా క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా మాట్లాడి నామరూపాల్లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ సమస్యపై మెగా డాటర్ నిహారిక స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే ఉందని చెప్పడం తప్పని నిహారిక అభిప్రాయపడింది.
ప్రతి రంగంలో కూడా ఇలాంటివి ఉన్నాయని… తాను చాలా ఘటనల గురించి విన్నానని చెప్పింది. ఎవరైనా ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుందని వాస్తవాన్ని బయటపెట్టింది. “నీ ప్రమేయం లేకుండా జరిగితే అది రేప్ కిందకు వస్తుంది. ఏదైనా జరిగిపోయాక వాళ్లు అది చేశారు… వీళ్లు ఇది చేశారు అని చెప్పడం మంచిది కాదు” అని బెదిరింపులకు పాల్పడుతున్న నటీమణులకు పరోక్షంగా చురకలు అంటించింది. “కొత్తగా అవకాశాల కోసం పరిశ్రమకి వచ్చే వారికి, నాకు చాలా తేడా ఉంది. నా బ్యాగ్రౌండ్ వేరు.. వారి బ్యాగ్రౌండ్ వేరు. అందుకే నాలా వారు మాట్లాడలేక పోవచ్చు. అందుకే నాకు ఇది తప్ప మరో దారి లేదు అనుకుంటేనే దానికి సిద్ధపడాలి” అని నిహారిక సూచించింది.