నిశ్శ‌బ్దం సినిమా రివ్యూ & రేటింగ్!

“ప్రేమ… ప్రేమికులని మాత్రమే కాదు, క్రిమినల్స్‌ని కూడా తయారు చేస్తుంది” అని డైరెక్టర్ హేమంత్‌ మధుకర్, రైటర్ కోన వెంకట్ అంటున్నారు. ఎవరి ప్రేమ ఎవరిని క్రిమినల్స్‌గా తయారుచేసిందో ‘నిశ్శబ్దం’ చూసి తెలుసుకోవాలి. థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిన్మా ఓటీటీలో విడుదలైంది.

కథ: ఆంటోనీ (మాధవన్) ఫేమస్ చెల్లో ప్లేయర్. చెవిటి, మూగ అమ్మాయి సాక్షి (అనుష్క) పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. నిశ్చితార్థం చేసుకుంటారు. అది జరిగిన రెండు రోజులకు సాక్షి క్లోజ్ ఫ్రెండ్ సోనాలి (షాలిని పాండే) కనిపించకుండా పోతుంది. ఆమె కోసం దిగులు పడిన సాక్షిని హాలిడేకి తీసుకువెళ్తాడు ఆంటోనీ. తిరిగొచ్చేటప్పుడు హాంటెడ్ హౌస్ వుడ్‌సైడ్ విల్లాలో ఒక పెయింటింగ్ కోసం వెళ్తారు. అక్కడ ఆంటోనీ మరణిస్తాడు. ఓ 46 ఏళ్ళ క్రితం అక్కడ దంపతుల మరణానికి ఆధారాలు దొరక్కపోవడంతో ఆత్మ కారణమని అందరూ నమ్మడం ప్రారంభిస్తారు. ఆంటోనీ మరణానికి కూడా ఆత్మ కారణమా? లేదంటే పైన చెప్పుకొనట్టు ప్రేమ తయారు చేసిన క్రిమినల్స్ చంపారా? ఈ కథలో సియాటెల్ క్రైమ్ డిటెక్టీవ్ మహా (అంజలి), కెప్టెన్ రిచర్డ్ (మైఖేల్ మ్యాడసన్) పాత్రలు ఏమిటన్నది ఆసక్తికరం.

నటీనటుల పనితీరు: అనుష్కకు సాక్షి క్యారెక్టర్ చేంజ్ ఓవర్. ‘బాహుబలి’, ‘భాగమతి’ సిన్మాలకు కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. డైలాగులు లేకపోయినా కళ్లతో హావభావాలు పలికించారు. హృదయానికి దగ్గరైన వ్యక్తిని పోగొట్టుకున్న బాధను కళ్లలో చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు మనకు అనుష్క, ఆమె క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తాయి. గత సినిమాల తాలూకూ ఇమేజ్ గుర్తుకు రాకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అనుష్క తరవాత మాధవన్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. క్యారెక్టర్‌కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు.

క్రైమ్ డిటెక్టివ్‌గా ఇంపార్టెంట్ రోల్‌లో అంజలి కనిపించారు. వెయిట్ తగ్గడంతో క్యారెక్టర్‌కి తగ్గట్టు పర్‌ఫెక్ట్ ఫిజిక్‌లో ఉన్నారు. మైఖేల్ మ్యాడసన్ సినిమాకి మైనస్. షాలిని పాండే క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ అయినప్పటికీ ఆమె కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సుబ్బరాజు హీరో లెవల్ క్యారెక్టర్ చేశారు. శ్రీనివాస్ అవసరాలకి అంత స్కోప్ దక్కలేదు.

సాంకేతికవర్గం పనితీరు: థ్రిల్లర్ సిన్మాలకు కథ కంటే కథనం ముఖ్యం. అసలు విషయం ఆఖరు వరకు చెప్పకూడదు. ఆడియన్ కి అర్థం కాకుండా కథను ముందుకు నడిపించాలి. అదేంటో? ‘నిశ్శబ్దం’ చూస్తున్న ప్రేక్షకులకు హంతకుడు ఎవరై వుంటారో ఒక ఐడియా వస్తుంది. డైరెక్టర్, రైటర్ ప్రేక్షకులకు క్లూలు వదులుతూ వెళ్ళారు. సినిమా ప్రారంభం బాగుంది. ఓపెనింగ్ సీన్ లో క్యూరియాసిటీ కలిగించారు. తరవాత దాన్ని కంటిన్యూ చెయ్యడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్టాఫ్ కొంచెం బాగా తీశారు. అక్కడితో స్టఫ్ అయ్యిపోయింది. స్క్రీన్ ప్లేలో టెక్నిక్స్ అటకెక్కింది. ఇన్వెస్టిగేషన్ వల్ల ఆడియన్ కి తెలియాల్సిన విషయాలు ముందే అర్థమా అవుతూ వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఇన్వెస్టిగేషన్ కి అడ్డు తగులుతూ డిస్టర్బ్ చెయ్యడమే కాదు, గ్రిప్పింగ్ గా వుండాల్సిన స్క్రీన్ ప్లేను పేలవంగా మార్చాయి. ద్వితీయార్ధంలో సుబ్బరాజు కథ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత సినిమా మరి బోరింగ్ అవుతుంది. మాధవన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మరీ టూ మచ్. అక్కడ సాలిడ్ ఎమోషన్ వుండుంటే సినిమాను కొంతైనా సేవ్ చేసేది.

‘నిశ్శబ్దం’ కథను అమెరికాలోని సియాటెల్ నేపథ్యంలో చెప్పడం వల్ల కొత్త లొకేషన్లు చూపించడానికి సినిమాటోగ్రాఫర్ కి చాన్స్ దొరికింది తప్ప కథ కు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. పైపెచ్చు ఇంగ్లీష్ ఏ మాత్రం రాని తెలుగు ప్రేక్షకులకు సినిమా దూరం అయ్యింది. తెలుగు మాటల మధ్యలో ఇంగ్లీష్ డైలాగులు చాలా ఉన్నాయి. సియాటెల్ నేపథ్యం, మైఖెల్ మ్యాడసన్ క్యారెక్టర్ హాలీవుడ్ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చాయి. అయితే సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో వర్క్ బాగుంది. స్టోరీకి అవసరమైన మూడ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో పాటలు అవసరం లేదు. స్టోరీకి అడ్డుతగిలాయి. అయితే గోపీసుందర్ ట్యాన్లు మళ్లీ వినొచ్చు. గిరీష్ గోపాలకృష్ణన్ నేపథ్య సంగీతం ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్ లో వున్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదని ప్రతి సన్నివేశంలో తెలుస్తూ వుంటుంది.

విశ్లేషణ: హారర్ సిన్మాలా ‘నిశ్శబ్దం’ మొదలవుతుంది. కానీ, హారర్ కాదు. ప్రారంభమైన కాసేపటికి థ్రిల్లర్ సిన్మాలా టర్నింగ్ తీసుకుంటుంది. కానీ, థ్రిల్లర్ కూడా కాదు. ఫ్రెండ్షిప్ బేస్ చేసుకుని తీసిన రివెంజ్ స్టోరీ. స్క్రీన్ ప్లేతో కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు. అది బెడిసికొట్టింది. సూపర్ యాక్టర్లను తీసుకుని వేస్ట్ చేశారు. ఫస్టాఫ్ సోసోగా వున్నప్పటికీ, సెకండాఫ్ మరీ సోదిగా అన్పిస్తుంది. అసలు ట్విస్ట్ రివీల్ చేశాక ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. ఫ్రీ టైమ్ వుంది. పనులు ఏమీ లేవు అనుకుంటే సినిమా చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

ప్లాట్ ఫామ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో

Click Here To Read in ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus