ఎద్దు ఈనింది అంటే.. దూడను గాట కట్టేయండి.. ఈ సామెతకు నిలువెత్తు ఉదాహరణ కావాలి అంటే సినిమా పరిశ్రమలో పురుషులు ఎదుర్కొనే లైంగిక దాడి ఆరోపణలు చూస్తే సరి. ఎవరైనా వచ్చి ఫలానా సినిమాకు సంబంధించిన వ్యక్తి తనను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు అని అంటే ఇక అతని పరువును పాతరేయడానికి అందరూ రెడీ అయిపోతారు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. ఈ విషయంలో విమర్శలు వస్తున్నా.. ఆ తీరు ఇంకా కొనసాగుతోంది.
అయితే, లైంగిక వేధింపుల కేసులు అన్నీ నిజం కావు, ఒక్కో ఆరోపణ వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది అని అంటుంటారు. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలి (Nivin Pauly) విషయంలో ఇదే తేలింది. సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో హీరో నివిన్ పౌలీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
ఆత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళీ హీరో నివిన్ పౌలీతోపాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చిత్రహింసలకు గురిచేశారని బాధిత యువతి ఫిర్యాదు చేసింది. కొత్తమంగళం మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుపై బుధవారం విచారణ జరగ్గా.. నివిన్ పౌలీకి న్యాయ స్థానం క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో నిందితుల జాబితా నుండి అతడి పేరును తొలగించారు. వేధింపులు జరిగినట్లు మహిళ ఆరోపించిన రోజుపన నివిన్ దుబాయిలో లేరని దర్యాప్తు బృందం కోర్టుకు వెల్లడించింది.
యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆ రోజున తాను కొచ్చిలోని షూటింగ్ లొకేషన్‌లో ఉన్నానని నివిన్ గతంలోనే చెప్పారు. పాస్‌పోర్టును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కూడా చెప్పాడు. ఇప్పుడు పోలీసుల విచారణలో అదే తేలింది. డబ్బులు, ఫేమ్ కోసమే ఆ మహిళ ఆరోపణలు చేస్తుందని నివిన్ పౌలీ ఆరోపణల సమయంలో వాపోయాడు. అప్పుడు కొంతమంది మాత్రమే పట్టించుకున్నారు. ఇప్పుడు నివిన్ వాదన నిజమైన నేపథ్యంలో ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ఆరోపణలు ఆగుతాయేమో చూడాలి.