లాక్ డౌన్ టైంలో ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న మలయాళ పరిశ్రమ ఇప్పుడు మరో విధంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మలయాళ ఇండస్ట్రీ పెద్దలందరూ తలదించుకునేలా చేసిన హేమ కమిటీ రిపోర్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ రిపోర్ట్ పుణ్యమా అని ఇండస్ట్రీలోని చీకటి కోణాలు, లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆల్రెడీ జయసూర్య (Jayasurya) ఓ కేసులో ఇరుక్కున్నాడు, మరింత మంది నటులు, దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా ఈ ఉదంతంలో మలయాళ యువ కథానాయకుల్లో ప్రముఖుడైన నివిన్ పౌలీ (Nivin Pauly) పేరు గట్టిగా వినిపిస్తోంది. మలయాళ చిత్రం “ప్రేమమ్”తో (Premam) సౌత్ ఇండియా మొత్తం నివిన్ పౌలీ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమాను తెలుగులో నాగచైతన్య (Naga Chaitanya) అదే పేరుతో రీమేక్ కూడా చేసి మంచి హిట్ అందుకున్నాడు.
అటువంటి నివిన్ పౌలీ ఒక అమ్మాయికి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని కబుర్లు చెప్పి, దుబాయ్ తీసుకెళ్లి అక్కడ మరో అయిదుగురుతో కలిసి అమ్మాయిని శారీరకంగా భంగపరిచాడని స్వయంగా ఆ యువతి కేస్ వేయడంతో.. నివిన్ పౌలీపై నాన్ బెయిలబుల్ కేస్ ఛార్జ్ చేయడం జరిగింది. ఈ విషయమై నివిన్ పౌలీ స్పందించి.. “అవన్నీ పుకార్లు, ఈ విషయం అబద్ధం అని ప్రూవ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాను” అని పోస్ట్ చేసినప్పటికీ.. హేమ కమిటీ కారణంగా ధైర్యంగా ముందుకొచ్చి అమ్మాయి చెప్పే విషయానికి ప్రస్తుతానికి ఎక్కువ బలం ఉంది.
మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇకపోతే.. మలయాళ ఇండస్ట్రీపై వరుసబెట్టి వస్తున్న ఈ క్యాస్టింగ్ కౌచ్ కేసుల విషయంలో ఇప్పటివరకు మలయాళ ఇండస్ట్రీ పెద్దలు ఒక స్టాండ్ తీసుకోకపోవడం కొసమెరుపు.