నోటా

“గీత గోవిందం” చిత్రంతో వందకోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకొని.. యువ కథానాయకుల జాబితాలో మొదటిస్థానం కైవసం చేసుకోవడానికి అత్యంత చేరువలో ఉన్న విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “నోటా”. పోలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఎప్పట్లానే సంచలనాలు నమోదు చేసింది. “వెట్టటం” అనే తమిళ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కడమే కాక ఒకేసారి విడుదలైంది. మరి రౌడీ బాయ్ గా ఆకట్టుకొన్న విజయ్ దేవరకొండ “రౌడీ సీయం”గా ఏమేరకు అలరించాడో చూద్దాం..!!

కథ : వెరైటీ స్టార్ గా సినిమాల్లో కొన్నాళ్లపాటు వెలుగొంది.. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వాసుదేవ్ (నాజర్) ఒక కేస్ లో ఇరుక్కోవడం వలన తాను గుడ్డిగా నమ్మే ఒక స్వామీజీ చెప్పినట్లుగా.. తాను కేస్ నుంచి బయటపడేవారకూ తన కుమారుడు వరుణ్ (విజయ్ దేవరకొండ)ను ముఖ్యమంత్రిగా నియమిస్తాడు.

కనీసం తన రాష్ట్ర గవర్నర్ ఎవరన్నది కూడా తెలియని వరుణ్ సీయం కుర్చీలో కూర్చుంటాడు. కానీ.. వరుణ్ ముందు అనుకొన్నట్లుగా ఇది రెండు లేదా మూడు వారాల్లో ముగిసిపోయే ఆట కాదని, తాను ఈ చందరంగంలో బంధించబడ్డానని అర్ధం చేసుకొంటాడు. అయితే.. తాను పావులు కదపడానికంటే ముందే కొందరు కీలకమైన మరియు ప్రమాదకరమైన వ్యక్తులు ఈ ఆటలో వరుణ్ ను చుట్టుముడతారు.
ఈ రాజకీయ చదరంగంలో వరుణ్ ఎలా నెగ్గుకొచ్చాడు? అనేది “నోటా” కథాంశం.

నటీనటుల పనితీరు : ప్లే బోయ్ టర్నడ్ సీయంగా కన్ఫ్యూజ్డ్ యంగ్ మేన్ రోల్లో విజయ్ దేవరకొండ ఫస్టాఫ్ మొత్తం నెట్టుకొచ్చినా.. సెకండాఫ్ లో మాత్రం తేలిపోయాడు. దర్శకుడు ఆనంద్ శంకర్ సినిమాలోని ఇంటెన్సిటీకి తగ్గట్లు విజయ్ దేవరకొండను వినియోగించుకోలేకపోయాడా లేక తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో షూట్ చేయడం వలన వచ్చిన ఇబ్బందులో తెలియదు కానీ.. విజయ్ తనదైన శైలి పాత్రలో కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. ఒక్క ఛార్మినార్ ప్రెస్ మీట్ సీన్ లో మాత్రం అర్జున్ రెడ్డి తరహాలో రెచ్చిపోయాడు.

మెహరీన్ ను ఈ చిత్రంలో కథానాయిక అనడం కంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనడం ఉత్తమం. సినిమాలో సత్యరాజ్ లాస్ట్ లో క్లారిటీ ఇవ్వబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే అమ్మడు హీరోకి సిస్టర్ అయిపోయేది. నాజర్, సత్యరాజ్ లు తమ పాత్రలకు తమ సీనియారిటీతో న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : సాంకేతికవర్గం పనితీరు గురించి మాట్లాడుకొనే ముందు.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన “నోటా” టైటిల్ గురించి చెప్పుకోవాలి. సినిమా మొత్తంలో “నోటా” అనే డైలాగ్ ఒక్కటంటే ఒక్కసారి కూడా వినిపించదు. సినిమాకి ఆ టైటిల్ ను అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం మాత్రమే పెట్టారని తెలుస్తున్నప్పటికీ.. కనీస స్థాయి కనెక్టివిటీ ఉండాలి కదా అనిపిస్తుంది. ఇక నటీనటులందరూ తమిళులే కావడం, ఒక్కరికీ కూడా లిప్ సింక్ లేకపోవడంతో.. తెలుగు రాష్ట్రంలో కూర్చుని తమిళ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది తప్ప స్ట్రయిట్ తెలుగు సినిమా అన్న భావన ఎక్కడా కలగదు. ఆఖరికి విజయ్ దేవరకొండ పాత్రకి కూడా చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ లేకపోవడం గమనార్హం.

దర్శకుడు ఆనంద్ శంకర్ ఎంచుకొన్న కథ “వెట్టటన్” అనే ఓ తమిళ పుస్తకం నుంచి. తమిళ పుస్తకం కావడంతో తమిళనాడు రాజకీయ పరిస్థితులను మాత్రమే ప్రతిబింబించింది కానీ.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క సందర్భాన్ని కానీ నాయకుడ్ని కూడా గుర్తుకు చేయలేకపోయింది. అందువల్ల మనకు సంబంధం లేని పరాయి భాషా చిత్రాన్ని చూస్తున్న భావన కలుగుతుందే తప్ప.. ఇది మన సినిమాని అని ఎక్కడా అనిపించదు. విజయ్ దేవరకొండ ఇమేజ్ కి ఈ సినిమా నిజానికి టైలర్ మేడ్ క్యారెక్టర్ లాంటిది. కానీ.. దర్శకుడు ఆ సినిమాను ఆకట్టుకొనే విధంగా మలచడంలో తడబడ్డాడు. ఆ కారణంగా సినిమా విజయ్ దేవరకొండ ఫ్లాప్ సినిమాల్లో ఒకటైన్ “ద్వారక” క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా చేయలేకపోయింది.

శామ్ సి.ఎస్ పాటలు పెద్దగా గుర్తుండవు కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ బడ్జెట్ కు, కథకు తగ్గట్లుగా ఉంది. ఎడిటర్ కి ఇంకాస్త ఫ్రీడం ఇచ్చి ఉంటే బాగుండేది. సినిమాలో అవసరం లేని సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ నిర్ధాక్షిణ్యంగా తీసేస్తే కనీసం బోర్ కొట్టించకుండా అయినా ఉంటుంది.

విశ్లేషణ : విజయ్ దేవరకొండ స్టామినాకి యాసిడ్ టెస్ట్ లాంటి సినిమా “నోటా”. సినిమాలో కంటెంట్ లేకపోవడం, విజయ్ కూడా నటుడిగా మెప్పించలేకపోవడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ ను పక్కనపెట్టి.. లాంగ్ రన్ బట్టి విజయ్ స్టామినా అంచనా వేయడం జరుగుతుంది. ఇకపోతే.. విజయ్ దేవరకొండ వీరాభిమానుల్ని సైతం మెప్పించలేకపోయిన ఈ చిత్రం సగటు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమే.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus