లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషించిన చిత్రం “O2”. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ నోచుకోలేక హాట్ స్టార్ లో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: పార్వతి (నయనతార) కొడుకు వీర (రిత్విక్) ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటాడు. కొచ్చిన్ లో ఆపరేషన్ చేయించడం కోసం బస్సు ప్రయాణం మొదలెడతారు. వర్షం వల్ల కొండచరియలు విరిగిపడి.. పార్వతి ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో మట్టి కింద కూరుకుపోతుంది. గాలి ప్రవేశించడానికి కూడా గ్యాప్ లేకపోవడంతో.. అందరూ ఆక్సిజన్ (O2) కోసం తన్నుకు చచ్చే స్థితికి చేరుకుంటారు. ఈ పరిసస్థితి నుంచి పార్వతి తనను తాను కాపాడుకుంటూ.. కొడుకును ఎలా రక్షించుకుంది? అనేది చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు: బాధ్యతగల తల్లిగా నయనతార నటనతో ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికీ.. ఆమె క్యారెక్టరైజేషన్ కు సరైన క్లారిటీ ఇవ్వలేదు. అలాగే.. ఆమె ప్రవర్తనకు సరైన ఎమోషన్ కూడా ఎలివేట్ అవ్వలేదు. మాస్టర్ రిత్విక్ కొడుకు పాత్రలో అలరించాడు. కరప్ట్ పోలీస్ ఆఫీసర్ గా భారత్ నీలకందన్, బస్ డ్రైవర్ గా ఆడుకాలం మురుగదాస్ ల పాత్రలు పర్వాలేదు అనిపించాయి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు విక్నేష్ పలు హాలీవుడ్ చిత్రాల నుండి స్పూర్తి పొంది కథను రాసుకున్న విధానం బాగున్నప్పటికీ.. కథనాన్ని మాత్రం గాలికొదిలేశాడు. అందువల్ల కథగా చెప్పుకోవడానికి, సినిమాగా చూడడానికి చాలా తేడా ఉంటుంది అనే విషయాన్ని పట్టించుకోలేదు. అలాగే లాజిక్స్ అనేవి ఎక్కడా కనిపించవు. కథకుడిగా పర్వాలేదు అనిపించుకున్నా.. దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు విక్నేష్. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ చాలా పేలవంగా ఉన్నాయి.
విశ్లేషణ: నయనతార అభిమానులు తప్పితే.. సగటు ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా కూడా ఆకట్టుకోలేని చిత్రం “O2”. ఒటీటీ రిలీజ్ కాబట్టి ఓపికతో ఒకసారి చూస్తే చూడండి.
రేటింగ్: 1.5/5