మొన్నీమధ్య వచ్చిన సినిమాల్లో అందులోనూ విజయం సాధించిన సినిమాల్లో ఇంకా చెప్పాలంటే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఏదో వస్తువు పట్టుకుని కామన్ పాయింట్ అని అంటాం అనుకుంటున్నారామో… అదేం కాదు బాగా వినిపించే పాయింటే కామన్ పాయింట్. దీంతో బ్లాక్‌బస్టర్ కొట్టాలంటే మిగిలిన దర్శకులు కూడా ఇదే పని చేయాలి అనేంతలా ఆ విషయం గురించి చర్చ జరుగుతోంది. అదే పాత పాట.
అవును, మీరు చదివింది కరెక్టే. ఇటీవల వచ్చి మంచి విజయం అందుకున్న సినిమాల్లో కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో పాత పాటలు వినిపిస్తున్నాయి. అది కూడా ఏదో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌లా కాదు. క్లియర్‌గా మెయిన్ ఆర్టిస్ట్ నేపథ్యంలోనే ఆ పాత పాటలు ఉంటున్నాయి. రీసెంట్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‘యానిమల్’ సినిమాని మీరు చూసి ఉంటే ఈ విషయం మీకు అర్థమైపోతుంది. లేదంటే ‘లియో’ సినిమా చూసినా, ‘భగవంత్ కేసరి’ చూసినా, ‘విక్రమ్’ చూసినా ఈ విషయం ఈజీగా చెప్పేయొచ్చు.
పైన సినిమా పేర్లు అన్నీ చెప్పేశాం కాబట్టి… ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. పైన సినిమాల్లో ఏదో సందర్భంలో హీరో పాత పాటలతో, అప్పటి మ్యూజిక్‌తో కనిపించాడు. ‘యానిమల్’ సినిమాలో యంగ్ రణ్‌బీర్ కపూర్‌ను ఇంట్రడ్యూస్ చేసే విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘రోజా’ సినిమా పాట వాడుకున్నారు. ఇక విలన్ బాబీ డియోల్ కోసం అయితే పాత పంజాబీ పాట బయటకు తీశాడు. ‘లియో’ సినిమాలో కేఫ్‌లో జరిగే ఫైట్ బ్యాగ్రౌండ్ స్కోర్‌గా ఎప్పుడో వచ్చిన ఇళయరాజా, దేవా సాంగ్స్ ప్లే చేశారు వావ్ ఫీలింగ్ ఇచ్చారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్.
ఇక ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాలో బస్సులో ప్రయాణిస్తూ బాలకృష్ణ నందమూరి తారకరామారావు పాటను హం చేస్తూ రౌడీలను చితకొడతాడు. అక్కడ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఉంటే అంత కిక్ వచ్చేది కాదేమో. కమల్ హాసన్ ‘విక్రమ్’లోనూ 1986 నాటి ‘విక్రమ్’ ఒరిజినల్ ట్రాక్ వాడారు దర్శకుడు లోకేశ్. ‘బ్రో’ సినిమాలో పవన్ కల్యాణ్ పాత పాటల్ని చూసుంటారు.