సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులు కాస్త అనారోగ్యం పాలవ్వడం ఆలస్యం.. వాళ్ల చుట్టూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఎవరు, ఎక్కడి నుండి పుకార్లు రేపుతారో తెలియదు కానీ.. ‘ఆయన ఇక లేరు’ అంటూ స్టేటస్, ట్వీట్లు చేసేస్తుంటారు. దీంతో అలాంటిదేం లేదు, ఆయన బాగానే ఉన్నారనో, ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారనే కుటుంబ సభ్యులు, సన్నిహితులు క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఇలాంటి ఇబ్బంది పడుతున్న నటుడు శరత్‌బాబు అని చెప్పాలి. ఆయన కన్నుమూశారు అంటూ.. పుకార్లు ఎక్కువయ్యాయి.
సీనియర్ నటుడు శరత్ బాబు గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ‘ఆయన చనిపోయారు’ అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. కొంతమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ మేరకు ట్వీట్లు చేయడంతో అందరూ నిజం అనుకున్నారు. అయితే అతను బాగానే ఉన్నారంటూ సన్నిహితులు చెప్పాల్సి వచ్చింది. దీంతో ఇది సరైన పద్ధతి కాదు. ఇలా లేనిపోని పుకార్లు వద్దని నెటజన్లు అంటున్నారు.
శరత్ బాబు(Sarath Babu) ఆరోగ్యం విషయంలో వస్తున్న గాసిప్స్‌పై ఆయన సోదరి సీరియస్ అయ్యారు. అన్నయ్య క్షేమంగానే ఉన్నారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయనను ఐసీయూ నుండి రూమ్‌కి షిఫ్ట్ చేశారని కూడా చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే శరత్‌బాబు పూర్తిగా కోలుకుని మీడియాతో మాట్లాతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, తన స్వగ్రామం ఆముదాలవలసలో ఉన్న శరత్‌బాబు సోదరుడు కూడా ఆయన చనిపోలేదని మీడియాకు వెల్లడించారు.
ఇంకోఒవైపు శరత్ బాబుకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో బుధవారం రాత్రికి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. అయితే వీటికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడేలా.. ఇలాంటి వార్తల విషయంలో నిగ్రహంగా ఉండటం ఆయా వ్యక్తుల చేతుల్లో ఉంది. మరేం చేస్తారో చూడాలి.