టాలీవుడ్లో మోస్ట్ ప్రెస్టీజియస్ సీజన్ ఏదైనా ఉందా అంటే సంక్రాంతి అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఆ సీజన్ కోసం చాలా మంది అగ్ర హీరోలు, ఒక్కోసారి చిన్న హీరోలు కూడా పోటీ పడుతుంటారు. సినిమాను ఆ టైమ్‌కల్లా సిద్ధం చేసి, విడుదల చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ సీజన్‌కు అనుకున్నది అనుకున్నట్లు జరగడం లేదు. దీంతో ఏమైంది సంక్రాంతి సీజన్‌కి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఏడాది లాగే వచ్చే ఏడాది కూడా క్లారిటీ లేకుండా ఉంది.
రవితేజ కొత్త సినిమా ‘ఈగల్’ రిలీజ్ డేట్‌ను టీమ్ అనౌన్స్ చేసింది. డేట్ క్లియర్‌గా చెప్పలేదు కానీ.. 2024 సంక్రాంతి అని అయితే చెప్పింది. దీంతో మాస్ మహరాజ్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తే.. మిగిలిన వారికి కన్‌ఫ్యూజన్ వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? ఇప్పటికే సంక్రాంతికి సినిమాలు ఫుల్ ప్యాక్ అయి ఉంటే.. ఈ సినిమా ఎందుకు బరిలోకి దిగినట్లు అని అంటున్నారు. దీంతో ఏ సినిమా వాయిదా పడుతుంది అంటూ చర్చలు మొదలుపెట్టారు. కొందరైతే ఏటా ఇదేం పంచాయితీ.. ఒక పద్ధతిగా డేట్స్ అనుకోవచ్చు కదా అని కూడా అంటున్నారు.
టాలీవుడ్లో బెర్తులు బుక్ అనే కాన్సెప్ట్ చాలా రోజుల నుండి ఉంది. అలా వచ్చే పెద్ద పండగక్కి ఏ సినిమాలు వస్తాయో ఓ ఐడియా అయితే ఉంది. మహేష్‌బాబు – త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సంక్రాంతికే అంటున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ కూడా అప్పుడే అన్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి సంక్రాంతికి ఓ సినిమా పక్కా. సెట్స్ మీదున్న పవన్ కల్యాణ్ 3 సినిమాల్లో ఒకటి ఉంటుంది అని కూడా లెక్కలేశారు.
ఇలాంటి సమయంలో రవితేజ బరిలోకి రావడంతో ఏ సినిమాలు వెనక్కి వెళ్లాయి అనే చర్చ మొదలైంది. ఏదో సినిమా సంక్రాంతికి రాదనే ఉద్దేశంతోనే రవితేజ ‘ఈగల్’గా వస్తున్నాడు అని అంటున్నారు. దీంతో ఈ క్లారిటీ లేకుండా సంక్రాంతి (Sankranti )సినిమాల ప్రహసనం వచ్చే ఏడాది కూడా ఉంటుందా అనే అసహనం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.