సెకండ్ హ్యాట్రిక్ కోసం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) – దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) సిద్ధమయ్యారు. వీరిద్దరి కలయికలో పాన్ ఇండియా చిత్రంగా ‘అఖండ 2: తాండవం’ సిద్ధమవుతున్నారు. సంయుక్తా మేనన్ (Samyuktha Menon) కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) కూడా నటిస్తోందని సమాచారం. అయితే ఆమె ఉందో లేదో అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు మరో పాత్ర విషయంలో క్లారిటీ వచ్చింది. అదే సినిమాలోని విలన్ పాత్ర.
బోయపాటి శ్రీను గత సినిమాల తరహాలోనే ‘అఖండ 2: తాండవం’ సినిమాలో కూడా విలన్ పాత్ర బలంగా ఉంటుంది. ఆ పాత్ర కోసం యువ నటుడు ఆది పినిశెట్టిని (Aadhi Pinisetty) తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్‌లో బాలకృష్ణ – ఆది పినిశెట్టిపై రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారట.
ఈ సీన్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని సినిమా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆది పినిశెట్టికి సరైన పాత్ర పడితే ఎలాంటి పర్‌ఫార్మెన్ ఇస్తాడు అనేది గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. బోయపాటి శ్రీను కూడా గతంలో ఆది పినిశెట్టిని ఓ ఊర మాస్ విలన్ పాత్రలో చూపించి మెప్పించారు. ‘సరైనోడు’ (Sarrainodu) సినిమాలో వైరం ధనుష్‌గా ఆది పినిశెట్టి నటనను మరచిపోలేం. ఆ తర్వాత సీతారామ్‌గా ‘అజ్ఞాతవాసి’లో (Agnyaathavaasi) వావ్ అనిపించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయినా ఆ పాత్రకు పేరొచ్చింది.
ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమాలో కూడా అంతకుమించి పాత్రే అని చెబుతున్నారు. ఆ సంగతేంటో తెలియాలి అంటే దసరా వరకు ఆగాల్సిందే. ఎందుకంటే సినిమా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి తగ్గట్టుగా సినిమా టీమ్ ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలి సినిమా సాధించిన విజయంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బాలయ్య – బోయపాటి కాంబో మీద అంతకుమించి ఉన్నాయి.