భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనే టైటిల్ సినిమా అనౌన్స్‌మెంట్ బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్రం చేపట్టిన ప్రతీకార దాడులు దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువవుతున్నాయి. ఈ సెన్సిటివ్ అంశం సిల్వర్ స్క్రీన్ పైకి రావాలని బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీపడటం విశేషం. ఏకంగా 15 మంది నిర్మాతలు టైటిల్ రిజిస్టర్ చేసుకోవడానికి దరఖాస్తు చేయగా, చివరికి నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పేరు మీద ఫిక్స్ అయ్యింది.
ఈ సినిమాకు ఉత్తమ్ నితిన్ దర్శకత్వం వహించనున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. పోస్టర్‌లో ఒక మహిళా సైనికురాలు సింధూరం పెట్టుకుని, చేతిలో రైఫిల్ పట్టుకుని యుద్ధభూమి వాతావరణాన్ని చూపించడం ఆకర్షణీయంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫైటర్ జెట్లు, పేలుళ్ల దృశ్యాలు సినిమాకు బలమైన మూడ్ సెట్ చేస్తున్నాయి. ఇప్పటికే మెయిన్ క్యాస్టింగ్ ఫిక్స్ అయ్యిందని బాలీవుడ్ వర్గాల చర్చ.
మూవీ అప్‌డేట్ లకు సంబంధించి జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి భారీ బ్యానర్లు కూడా ముందు పోటీకి దిగినా చివరికి ఈ ప్రాజెక్ట్ నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ దక్కించుకోవడం ఆసక్తికరమని ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. త్వరలోనే పూర్తి షూటింగ్ షెడ్యూల్, కథా రూపరేఖలను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ వంటి ఘట్టాలు సినిమాలో కీలకంగా ప్రస్తావనలోకి రాబోతున్నాయని అంచనా.
ఇక నెటిజన్ల మధ్య స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు పోస్టర్, కాన్సెప్ట్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు ప్రస్తుత యుద్ధ వాతావరణం మధ్య సినిమా ప్రకటనను అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) మూవీ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.