పావ కథైగల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 18, 2020 / 06:34 PM IST

ప్రస్తుతం ఆంథాలజీల కాలం నడుస్తోంది. ఇదివరకు కేవలం హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ జోనర్ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని ఇండియన్ సినిమాకి, ఆడియన్స్ కు అలవాటైంది. ఆ జోనర్ లో వచ్చిన కొత్త ఆంధాలజీ “పావ కధైగల్”. తమిళంలో తెరకెక్కిన ఈ నాలుగు కథల ఆంథాలజీని నెట్ ఫ్లిక్స్ నేడు (డిసెంబర్ 18) విడుదల చేసింది. సాయిపల్లవి, అంజలి, కల్కి, సిమ్రాన్, గౌతమ్ మీనన్ వంటి పేరున్న నటీనటులు నటించడం మరియు సుధ కొంగర, విగ్నేష్ శివన్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్ వంటి పాపులర్ డైరెక్టర్స్ దర్శకత్వం వహించడంతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సిరీస్ అందుకోగలిగిందో లేదో చూద్దాం.

మొదటి కథ: నా బంగారం

సత్తారు (కాళిదాస్ జయరాం) ఒక గే. ప్రస్తుతం గే అనేది సాధారణ విషయమే అయినప్పటికీ.. పల్లెటూరిలో అలాంటివారిని చాలా హేయంగా చూస్తుంటారు. అవన్నీ తట్టుకుంటూ.. ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకొని మొత్తానికి అమ్మాయిలా మారిపోయి తాను ఇష్టపడుతున్న అబ్బాయిని పెళ్లాడాలనుకుంటాడు సత్తారు. అయితే.. తాను ప్రేమిస్తున్న వ్యక్తి తనను కాదు తన చెల్లెల్ని ఇష్టపడుతున్నాడని తెలుసుకొని.. తన ప్రేమను, ప్రాణాన్ని, ఏళ్లుగా దాచుకుంటున్న డబ్బును త్యాగం చేసి మరీ వాళ్ళను కలుపుతాడు. క్లుప్తంగా ఇదీ “నా బంగారం” ఎపిసోడ్ కథ-కథాంశం. సుధ కొంగర ఈ ఎపిసోడ్ కు దర్శకురాలు. గే జెండర్ ను ఆమె ప్రాజెక్ట్ చేసిన విధానం, ఆ పాత్రలో కాళిదాస్ జయరాం జీవించిన విధానం అద్భుతం. మనిషిని కులం, మతం, వర్గం వంటి అంశాలతో విడదీసి చూస్తున్నది సరిపోక.. శారీరిక వ్యవహారశైలిని బట్టి కూడా హేళన చేస్తూ ఈ సమాజం ఎంత నీచంగా వ్యవహరిస్తోందో సహజంగా చూపించింది సుధ. ఎండింగ్ కూడా బాగా రాసుకొంది. అయితే.. సత్తారు త్యాగాన్ని మాత్రం సరిగా ఎలివేట్ చేయలేదు. ఎపిసోడ్ మొత్తానికి హుక్ పాయింట్ లాంటి ఆ సంఘటనను సింపుల్ గా ముగించిన విధానం ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వదు.

రెండో కథ: వాళ్ళను ప్రేమించుకోనీ

ఆది లక్ష్మి(అంజలి)-జ్యోతిలక్ష్మి (అంజలి) కవలలు. తండ్రికి భయపడి ఇద్దరూ తమ ప్రేమలను వ్యక్తపరచకుండా జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. తండ్రితో ఉండే ఆదిలక్ష్మి (అంజలి) వాళ్ళ డ్రైవర్ ను ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని తండ్రితో చెప్పి అతడు ఒప్పుకున్నాడనే ఆనందం ఆస్వాదించేలోపే తండ్రి సహచరుల కుల పిచ్చికి బలవుతుంది. అప్పుడే సిటీ నుంచి ఊరికి వచ్చిన జ్యోతిలక్ష్మి (అంజలి) కూడా తన ప్రేమను నాన్నతో చెప్పాలనుకుంటుంది. అయితే.. ఎక్కడ తన చెల్లలి లాగే తనను కూడా చంపేస్తాడేమో అని భయపడి తాను లెస్బియన్ (స్వలింగ సంపర్కురాలిని) అని అబద్ధం చెప్పి.. ఆ అబద్ధాన్ని ప్రూవ్ చేయడం కోసం అందరి ముందు తన స్నేహితురాలు పెనెలోపి (కల్కి) అధరాలపై ముద్దు పెడుతుంది. అంతా సర్దుమణిగాక తాను నిజంగా ప్రేమిస్తున్న కుర్రాడితో ఇంట్లో నుంచి పారిపోతుంది. ఒక్కోసారి పిల్లల ప్రేమను అర్ధం చేసుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉన్నప్పటికీ.. పక్కన ఉన్నవాళ్లు, బంధువులు వాళ్ళను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే అంశాన్ని కథగా ఎంచుకున్న విధానం బాగుంది కానీ.. మధ్యలో లెస్బియన్ కాన్సెప్ట్ తో చేసిన కామెడీ బాగోలేదు. మరి దర్శకుడు విగ్నేష్ శివన్ ఏమనుకొని ఈ ఎపిసోడ్ ను తీసాడో తెలియదు కానీ, ఒక సెన్సిబుల్ పాయింట్ ను డీల్ చేసే విధానం మాత్రం ఇది కాదు.

మూడో కథ: దివి కుమార్తె

మది (సిమ్రాన్) – సత్య (గౌతమ్ మీనన్)లది 20 ఏళ్ల దాంపత్య జీవితం. ఊర్లో సొంత ఇల్లు, కారు, ముగ్గురు పిల్లలు, సమాజంలో మంచి పేరు. అన్నీ ఉన్న చక్కని కుటుంబం వీరిది. వీళ్ళు ఇంత ఆనందంగా ఉండడం చూసి ఎవరికి కన్ను కుట్టిందో ఏమో.. అంతా బాగుంది అనుకొనే తరుణంలో ఇంట్లో అందరికంటే చిన్నది అయిన సత్య చిన్న కూతురుని కొందరు దుండగులు ఎత్తుకెళ్ళి అత్యాచారం చేస్తారు. అసలు అత్యాచారం అంటే ఏమిటో కూడా తెలియని వయసు ఆ చిన్నారిది. ఆ సమయంలో తల్లి మది (సిమ్రాన్) మదిలో మెదిలే ఆలోచనల చదరంగమే ఈ ఎపిసోడ్. సిరీస్ మొత్తంలో కాస్త సెన్సిబుల్ గా డీల్ చేసిన ఎపిసోడ్ ఇదొక్కటే. ఒక్క నిమిషం భయపెట్టి, మరో నిమిషం ఆలోజింపజేసే ఎపిసోడ్ ఇది. చైల్డ్ రేప్ అనే చాల సున్నితమైన అంశాన్ని గౌతమ్ మీనన్ డీల్ చేసిన విధానం ప్రశంసనీయం. సిమ్రాన్ తల్లి పాత్రలో జీవించేసింది. ఇంట్లో అలాంటి సంఘటన జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు. నేటి సమాజానికి చాలా అవసరమైన ఎపిసోడ్ ఇది.

నాలుగో కథ: ఆ రాత్రి

సుమతి (సాయిపల్లవి) తండ్రి (ప్రకాష్ రాజ్)కు చెప్పకుండా పెళ్లి చేసుకొని భర్తతో కలిసి సుఖంగా సిటీలో బ్రతుకుతుంటుంది. మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనిస్తుంది అనగా.. ఆమె తండ్రి ఆమెను వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. కొన్ని రోజులు ఆమెతో ఉండి ఇంటికి తీసుకెళతాడు. రేపు సీమంతం అని ఇంట్లో అంతా పండగ వాతావరణం. అందరూ పడుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో తండ్రి అప్పటివరకు మనసులో పెట్టుకున్న విషయాన్ని నీళ్లలో కలిపి కూతురికి ఇస్తాడు. విషం తాగిన సుమతి రక్తం కక్కుకుని మరణిస్తుంది. తమిళనాడులో నిజంగానే జరిగిన కథ ఇది. పరువు కోసం కన్న తండ్రి చేసిన దారుణమైన దుశ్చర్య. వెట్రిమారన్ ఈ ఎపిసోడ్ ను చాలా సహజంగా, భయం, బాధ ప్రేక్షకుడి మెదడులో, కళ్ళలో మెదిలేలా తెరకెక్కించాడు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకోవడం ఖాయం. చివరి అయిదు నిమిషాల్లో ప్రకాష్ రాజ్-సాయిపల్లవి నడుమ సన్నివేశాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. బెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ది హోల్ సిరీస్ గా ఈ ఎపిసోడ్ ను పేర్కొనవచ్చు.

విశ్లేషణ: నాలుగు ఎపిసోడ్స్ పరువు నేపథ్యంలో తెరకెక్కినవే. సుధ కొంగర ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది, వెట్రిమారన్ ఎపిసోడ్ బాధిస్తుంది, గౌతమ్ మీనన్ ఎపిసోడ్ ఆలోజింపజేస్తుంది. విగ్నేష్ శివన్ ఎపిసోడ్ మాత్రం చిరాకుపెడుతుంది. నెట్ ఫ్లిక్స్ నుంచి వస్తుంది అంటే అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి.వాటిని “పావ కథైగల్” అందుకోలేకపోయిందనే చెప్పాలి.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus