ఆడవారికి గౌరవం ఇవ్వాలి అనే విషయాన్ని మనం పురాణాల నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. దాన్ని ఎంతవరకూ ఆచరణలో పెడుతున్నాం అనేది వేరే విషయం అనుకోండి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆడవారికి గౌరవం అనేది చాలా అరుదుగా లభిస్తుంటుంది. అందుకే చిత్రపరిశ్రమలో హీరోలకి లభించినంత గౌరవమర్యాదలు హీరోయిన్లకు లభించవు. అయితే.. మొట్టమొదటిసారిగా చిత్రసీమలో ఆడవారికి ప్రాముఖ్యత పెరిగింది అనిపిస్తుంది. అందుకు కారణం ప్రస్తుతం చోటు చేసుకొంటున్న పరిణామాలే.
బాలీవుడ్ చిత్రం “పద్మావతి”కి సోలో రిలీజ్ ఇద్దామనే ఆలోచనతో అక్షయ్ కుమార్ తన “ప్యాడ్ మ్యాన్”ను ఏకంగా రెండువారాలు పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది ఆశ్చర్యకర విషయం. నిజానికి రెండు సినిమాలు ఒకేసారి విడుదలైన సమానమైన స్థాయిలో వసూళ్లు రాబట్టే స్టామినా హిందీ మార్కెట్ కు ఉంది. కానీ “పద్మావతి” సినిమా అప్పటికే ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని అక్షయ్ కుమార్ ఆ నిర్ణయం తీసుకొన్నాడు.
ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే.. అనుష్క టైటిల్ రోల్ ప్లే చేసిన “భాగమతి” కూడా గతేడాది రిలీజ్ అవ్వాల్సినప్పటికీ కారణాంతరాల వలన విడుదలవ్వలేదు. దాంతో.. జనవరి 26కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అదే సమయానికి మంచు విష్ణు “ఆచారి అమెరికా యాత్ర”, సందీప్ కిషన్ “మనసుకు నచ్చింది” చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రకటించబడినప్పటికీ.. ఆఖరి నిమిషంలో తమకు తాముగా బరి నుంచి తప్పుకోవడం అనేది “భాగమతి”కి ప్లస్ అయ్యింది. సో ఈవారం అనుష్క “భాగమతి”గా సింగిల్ గా వస్తుందన్నమాట. సో బాలీవుడ్ లో “పద్మావతి”, టాలీవుడ్ లో “భాగమతి”లు సింగిల్ గా శివంగుల్లా దూకబోతున్నారన్నమాట. సినిమా రిజల్ట్స్ ఎబౌ యావరేజ్ ఉన్నా మళ్ళీ ఫిబ్రవరి 9 వరకూ చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భవిష్యత్ లోనూ ఈ తరహా మహిళా ప్రాధ్యాన్యం ఉన్న సినిమాలకు మాత్రమే కాక కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఇదే విధంగా చిత్రసీమ సపోర్ట్ చేస్తే మంచి సినిమా పదికాలాలపాటు వర్ధిల్లుతుంది.