మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది. బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థలు కలిసి నిర్మించాయి. ఎప్పుడో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని నిర్మాతలు ఫిక్సయ్యి డేట్ కూడా అనౌన్స్ చేసినప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 2న విడుదల చెయ్యాలి అని అనుకున్నారు.
కానీ థియేటర్స్ మూతపడడం వల్ల ‘ఉప్పెన’ టీం ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరో పక్క వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఈ క్రమంలో ‘ఉప్పెన’ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ చెయ్యమని ఆఫర్స్ వస్తున్నాయట. కొత్త హీరో అయినప్పటికీ 18కోట్ల వరకూ రేటు చెబుతున్నారట. అయినప్పటికీ హీరో వైష్ణవ్ తేజ్ కానీ దర్శకనిర్మాతలు కానీ ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది.
సినిమాకి 25కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారు. ఏకంగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి భారీగా పారితోషికం ఇచ్చి తీసుకొచ్చారు. ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలి అంటే.. థియేట్రికల్ ఇవ్వాల్సిందే. ఇవన్నీ పక్కన పెట్టినా.. ‘ఉప్పెన’ పై దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని వినికిడి. అందులోనూ మెగా హీరో డెబ్యూ సినిమా.. అందుకే వెనకడుగు వెయ్యడానికి ఇష్టపడటం లేదని సమాచారం.