మన సినిమాకు ఆస్కార్ పురస్కారం రావాలని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. మొన్నామధ్య ‘నాటు నాటు..’ పాటతో ఆస్కార్ వచ్చినా అది సినిమాకు వచ్చిన్నట్లు కాదు. ఏటా దీని కోసం ప్రయత్నాలు సాగుతున్నా.. అకాడెమీ జ్యూరీని మెప్పించేలా అయితే ఉండటం లేదు. అయితే ఈ సారి పపువా న్యూ గినియా (పీఎన్‌జీ) దేశం నుండి మనకు సంబంధించిన సినిమా ఒకటి ఆస్కార్ బరిలో నిలిచింది. రా అండ్ రస్టిక్ సినిమాలతో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్కు సంపాదించుకున్న దర్శకుడు పా.రంజిత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
Papa Buka
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న పా.రంజిత్ సహ నిర్మాతగా వ్యవహరించిన ‘పాపా బుకా’ అనే సినిమా 98వ ఆస్కార్ అవార్డుల పోటీలో అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను మలయాళ దర్శకుడు బిజు కుమార్ దామోదరన్ తెరకెక్కించారు. ఆయనకు ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులు రావడం గమనార్హం. పపువా న్యూ గినియా దేశం నుండి ఈ సినిమా అర్హత సాధించింది. ఈ ఘనత అందుకున్న తొలి సినిమాగా రికార్డు కూడా సృష్టించింది.
అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లో పోటీ పడనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. మా నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్‌కు ఇవి గర్వించదగ్గ క్షణాలు. రెండు దేశాల సహ నిర్మాణంలో నేనూ భాగం కావడం మా నిర్మాణ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ‘పాపా బుకా’ మన కథలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. అకాడమీ అవార్డుల వేదిక ద్వారా ప్రపంచానికి ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని పా.రంజిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు.
పపువా న్యూ గినియా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తికాబోతున్న సందర్భంగా ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పీఎన్‌జీలో పోరాడిన భారతీయ సైనికుల గురించి ప్రపంచానికి చాటి చెప్పే చిత్రమిది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 19న విడుదల కానుంది.