పరిచయం

కొత్త హీరోహీరోయిన్లు.. ముఖ్యంగా థియేటర్ ఆర్టిస్ట్స్ అయిన విరాట్ కొండూరి-సిమ్రత్ కౌర్ జంటగా తెరకెక్కిన స్వచ్చమైన ప్రేమకథ “పరిచయం”. కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా లక్ష్మీకాంత్ చెన్నా తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని, హరీష్ శంకర్ వంటి సినీ ప్రముఖులు ఇన్వాల్వ్ అవ్వడంతో సినిమాకి రేంజ్ కి మించిన స్థాయిలో రీచ్ పెరిగింది. మరి పెరిగిన రేంజ్ స్థాయిలో సినిమా ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ : ఈ కథ ఎవరి జీవితంలో జరిగిందో తెలియదు కానీ.. ఇది నిజమైన కథ అని తెలిసినప్పుడు మాత్రం నేను భీభత్సమైన ఆశ్చర్యానికి గురయ్యాను. వందేళ్ళ చరిత్ర కలిగిన తెలుగు చిత్రసీమ నుంచి వచ్చిన లక్షలాది ఖళాఖండాల్లో వేలాది మెడికల్ మిరాకిల్స్ చూసిన అనుభవం ఉన్న నేను సైతం ఈ సినిమాకి స్ఫూర్తిగా నిలిచిన వారి నిజజీవితంలో జరిగిన మెడికల్ కమ్ మెకానికల్ మిరాకిల్ చూస్తూ రెండు నిమిషాలపాటు స్థాణువైపోవడమే కాదు.. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా అదెలా సాధ్యమైంది అంటూ.. నెత్తి మీద ఆపిల్ పడ్డ న్యూటన్ లా ఆలోచిస్తూ బయటకొచ్చాను.

ఇంతకీ నన్ను అంతలా ఆలోజింపజేసి, ఆశ్చర్యపరిచిన కథ ఏమిట్రా అంటే.. అరకులో నివసిస్తూ రైల్వేలో ట్రైన్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్న సుబ్బు (రాజీవ్ కనకాల), సాంబ (పృధ్వీ) మంచి స్నేహితులు. ఇద్దరి మిత్రుల భార్యలు ఒకేరోజు ప్రసవించగా.. సుబ్బుకి కొడుకు పుట్టగా, సాంబాకీ కూరుతు పడుతుంది.

సుబ్బు-సాంబల పిల్లలైన ఆనంద్ (విరాట్ కొండూరి), లక్ష్మీ (సిమ్రత్ కౌర్)లు చిన్నప్పట్నుంచే ఒకర్నొకరు ఇష్టపడతారు. పెద్దయ్యాక ఆ ఇష్టం ప్రేమగా మారడానికి పెద్దగా టైమ్ పట్టదు. అయితే.. వారి ప్రేమను వ్యక్తపరుచుకొని ప్రేమలోకంలో విహారం మొదలెట్టేలోపే.. లక్ష్మీ తండ్రి సాంబ రైలు పట్టాలపై ప్రేమసల్లాపాలు సాగిస్తున్న లక్ష్మీ-ఆనంద్ లను చూసి కోపంతో ఇద్దర్నీ కొట్టి.. విడదీసి, వెంటనే లక్ష్మికి వేరే పెళ్లి చేయాలని నిర్ణయించుకొంటాడు.

ఆ పెళ్లి ఇష్టం లేని లక్ష్మీ పురుగుల మందు తాగి.. హీరో కళ్ల ముందు చనిపోదామని నిర్ణయించుకొని అతడి దగ్గర రక్తం కక్కుకుంటూ స్పృహ కోల్పోయి పట్టాలపై ఒరిగిపోతుంది. అలా పడిపోయిన లక్ష్మిని మోసుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఆనంద్ కు.. ఆమె తాగిన పురుగుల మందు కారణంగా జ్ణాపకశక్తి కోల్పోయిందని (ముందే చెప్పాను కదా ట్విస్ట్ కి దిమ్మ తిరిగిపోతుందని) తెలుసుకొంటాడు. ఆ తర్వాత మతి భ్రమించిన తన ప్రియురాలిని మళ్ళీ మామూలు మనిషిగా మార్చుకోవడం కోసం కాకినాడలో బడా దాదా అయిన నాయుడు (శ్రీమన్నారాయణ) చంతన చేరి జీవిస్తుంటారు. మరి చివరికి లక్ష్మికి గతం గుర్తొచ్చి మళ్ళీ ఆనంద్ ను గుర్తు పట్టిందా లేదా? అనే ప్రశ్నకు దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా చాలా విచిత్రంగా చెప్పిన సమాధానమే “పరిచయం” చిత్రం.

నటీనటుల పనితీరు : విరాట్ కోడూరి చూడ్డానికి కొత్త కుర్రాడిలా ఉన్నా.. థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో కొన్ని సన్నివేశాల్లో చక్కగా నటించాడు. కాకపోతే.. కుర్రాడి కళ్ళల్లో ప్రేమ అనేది మాత్రం చాలా తక్కువగా కనిపించింది.

సిమ్రత్ కౌర్ రూపంలో తెలుగు సినిమాకి మరో మంచి ఆర్టిస్ట్ దొరికింది. కొన్ని క్లారిటీ లేని సన్నివేశాల్లో తప్ప.. సినిమా మొత్తంలో అమ్మడి నటనకి, అందానికి, అందమైన కళ్ళకి ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం. సరైన సినిమా పడాలే కానీ.. అమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం. చాలారోజుల తర్వాత నిన్నటితరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ పృధ్వీని మళ్ళీ వెండితెరపై చూడడం ఒక మంచి అనుభూతినిస్తుంది. ఆయన సాంబ అనే పాత్రలో జీవించిన విధానమూ బాగుంది. రాజీవ్ కనకాల ఎప్పట్లానే తనదైన టైమింగ్, స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించి నవ్వించాడు.

సాంకేతికవర్గం పనితీరు : సినిమా మొత్తానికి కథతో సంబంధం లేకుండా సినిమాకి న్యాయం చేసిన ఏకైక వ్యక్తి శేఖర్ చంద్ర. ఆయన స్వరపరిచిన బాణీలన్నీ వినసోంపుగా ఉండగా.. నేపధ్య సంగీతం చాలా చక్కగా ఉంది. అయితే.. శేఖర్ చంద్ర అందించిన సంగీతాన్ని దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా సరిగా వినియోగించుకోలేదంతే. నరేష్ రానా సినిమాటోగ్రఫీ చాలా ప్లెజంట్ గా ఉంది. అరకు అందాలను కథానాయిక సిమ్రత్ కంటే అందంగా చూపించాడు.

ఇక దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా గురించి చెప్పుకోవాలి.. నిజానికి ఆయన తెరకెక్కించిన “హైద్రాబాద్ నవాబ్స్” చిత్రానికి నేను వీరాభిమానిని. డెక్కన్ ఇండస్ట్రీకి పునాది రాయిలా నిలిచిన ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన “నిన్న నేడు రేపు” కూడా ప్రేక్షకులకు ఒక వైవిధ్యమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించింది. అలాంటి దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో “పరిచయం”పై రెగ్యులర్ మూవీ గోయర్స్ కు కనీస స్థాయి అంచనాలున్నాయి. అదే విధంగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుధీర్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ను అందించిన ఘనత కూడా కలిగిన లక్ష్మీకాంత్ చెన్నా “పరిచయం” చిత్రంతో దర్శకుడిగా, రచయితగా పూర్తి స్థాయిలో నిరాశపరిచాడు.

కథ బాగుందా లేదా అనే విషయం పక్కన పెడితే.. సినిమాలో కనీస స్థాయి లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. పురుగుల మందు తాగి పడిపోయిన హీరోయిన్ తలకి కట్టు ఎందుకు కట్టారు, అర్ధరాత్రి అరకు నుంచి కాకినాడ ట్రైన్ లో బయలుదేరిన హీరోకి ట్రైన్ ఎక్కేప్పుడు లేని గెడ్డం, కాకినాడలో దిగేసరికి వచ్చేయడం, కరెంట్ షాక్ తగిలి హీరోయిన్ కి మళ్ళీ గతం గుర్తుకురావడం లాంటి సన్నివేశాలు చూశాక ఈ చిత్రాన్ని నిజంగా లక్ష్మీకాంత్ చెన్నానే తీశాడా అనే అనుమానం వస్తుంది.

విశ్లేషణ : చిన్న సినిమా అనే పదానికి ప్రేక్షకుడు భయపడే స్థాయికి తీసుకొచ్చే చిత్రాల కోవలో చేరిన మరో చిత్రం “పరిచయం”. అసభ్యత, అశ్లీలత అనేవి మచ్చుకకు కూడా లేని ఈ చిత్రంలో కనీస స్థాయి లాజిక్స్ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్. ఇక ఈ 80ల కాలం నాటి ప్రేమకథను ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్, లాజిక్, సెన్స్ లాంటివి ఎక్స్ పెక్ట్ చేయకుండా.. రెండు గంటలపాటు థియేటర్లో సరదాగా కూర్చునే ఓపిక ఉన్న ప్రేక్షకులు మాత్రమే “పరిచయం” చేసుకోవడానికి వెళ్ళండి.

రేటింగ్ : 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus