‘బాహుబలి’ సినిమాతో దర్శకుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ పై ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారట. నిజానికి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా రీమేక్ షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది.
షూటింగ్ మధ్యలో సమయం దొరకడంతో పవన్ ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ కు వెళ్లారట. రాజమౌళిని ప్రత్యేకంగా కలిసి కాసేపు ముచ్చటించారట. కానీ దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు. చాలా కాలంగా పవన్ అభిమానులు రాజమౌళితో తమ అభిమాన హీరో సినిమా చేస్తాడేమో అని ఎదురుచూస్తున్నారు. కానీ వీరి కాంబినేషన్ కి సంబంధించి ఎలాంటి వార్తలు బయటకి రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయిన తరువాత రాజమౌళి..
మహేష్ బాబుతో ఓ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఇక పవన్.. క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వంటి దర్శకుల సినిమాలను లైన్లో పెట్టాడు.