సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడితే ఏదో ఒక చర్చ జరగాల్సిందే. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని గుచ్చుకునేవి, ఇంకొన్ని దూసుకుపోయేవి ఉంటాయి. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలాంటి స్పీచ్ చూశాం. ఆ స్పీచ్ వల్ల సినిమాకు నష్టమొచ్చింది అని కొందరు అంటుంటే.. ఇంకొందరేమో ఆ మాటలే సినిమాకు ప్రచారం తీసుకొచ్చాయి అని అంటుంటారు. ఆ విషయం పక్కనపెడితే.. పవన్ ఇటీవల ‘అంటే సుందరానికి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కి వెళ్లారు.
అక్కడ ఆయన మాటలు వినడానికి సాఫ్ట్‌గా ఉన్నాయి. కానీ వెనుక గూడార్థం ఉంది అనిపిస్తోంది. కావాలంటే ఆయన మాటలు మరోసారి చదివి చూడండి. ‘‘నటులకు రాజకీయపరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు. నరేష్ గారికి విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు. నాకు విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకు ఉంది’’ అని అన్నారు పవన్. చాలా రోజులుగా పవన్ సినిమాల్ని, రాజకీయాల్ని కలిపేస్తున్నారని అంటున్నారు.
ఈ మాటలతో దానిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇండస్ట్రీని, రాజకీయాలను నేను కలపను, మీరూ కలపొద్దు అని మిగిలిన నటులకు సూచించినట్లయింది. సినిమా నిర్మాణం గురించి, నటుల వర్గం, ప్రాంతం గురించి కూడా పవన్ మాట్లాడారు. ‘‘24 క్రాఫ్టులు కలిపితే వచ్చేది సినిమా. చాలామంది కళాకారులు కలిస్తే వచ్చేది సినిమా. ఈ కళకు కులం, మతం, ప్రాంతం ఉండదు. ఒక్క సినిమా కోసం విభిన్నమైన వ్యక్తులను, భాష, ప్రాంతం… ఇలా అందరు కలిసి ‘అంటే సుందరానికీ’ సినిమా తీశారు.
ఇంతమందిమి కలిస్తే తప్ప ఇంతమందిని ఆదరించలేం’’ అని అన్నారు పవన్. మామూలుగా అయితే సినిమా గురించి చెప్పినట్లు ఉంది. కానీ, గతంలో నటులకు సంబంధించిన ఓ కీలక సందర్భంలో నటుడి ప్రాంతం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. దానికి ఇప్పుడు పవన్ కౌంటర్ ఇచ్చారా? ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ ఏ ఒకరి సొత్తు కాదు. ఇది అందరి సొత్తు’’ అంటూ పవన్ స్ట్రయిట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో సినిమా నీది, నాది అనే చర్చ అయితే ఎక్కడా లేదు.
కానీ కొంతమంది నటులు సినిమాను తమ మాటలు, చేతల్లో ఉండేలా చూశారు అని విమర్శలు వచ్చాయి. మేం లేకపోతే సినిమా ముందుకెళ్లదు అని ఎవరనుకున్నా వారికి పవన్ కౌంటర్ ఇచ్చినట్లే. పవన్ మాటలకు ఎవరైనా స్పందిస్తారా? ఎప్పటిలా వదిలేసి తర్వాత పవన్ చెప్పింది కరెక్ట్ అని అనుకుంటారా అనేది చూడాలి.