పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిస్టారికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. 16వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే దర్శకుడు క్రిష్ ఈ సినిమాను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు.
కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మధ్యలో మరి కొన్ని చిన్న సినిమాలను కూడా మొదలు పెట్టడం తో ఈ సినిమా మరింత ఆలస్యం అయింది. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల మరొక తమిళ సినిమా రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియడంతో హరిహర వీరమల్లు యూనిట్ మరోసారి షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ వినోధయ సీతం అనే తమిళ సినిమాను రీమేక్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు. హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ డేట్ పై కూడా ఇటీవల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆగస్టు సెప్టెంబర్ సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 5న విడుదల చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇటీవల నిర్మాత ఏఎం రత్నం దర్శకుడితో కలిసి ఆ డేట్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఎలాగైనా ఈ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని క్రిష్ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసిన చివరి సినిమాలు ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు.