పవన్ కల్యాణ్ చేపట్టిన ధర్మ యాగం ఇప్పుడు వైరల్ అవుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధర్మయాగం చేపట్టారు. రెండు రోజుల పాటు సాగే ఈ యాగాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రారంభించారు. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలో యాగం ప్రారంభించారు. కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టువస్త్ర ధారణలో యాగశాలకు వచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇవాళ (జూన్,12) ఉదయం 6గం.55 నిమిషాలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంప్రదాయబద్ధంగా పట్టువస్త్ర ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. ధర్మం కోసం, నీతి కోసం, సమాజం కోసం సకల జనులంతా బాగుండాలని కోరుకుంటూ ఈ ధార్మిక , ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. సకల ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. భారీ ఎత్తున ఈ యాగ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు పండితులు, పూజారులు, వేదమూర్తులు.
ఇదిలా ఉండగా త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ చీఫ్ గా ఫుల్ ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఎన్నికలను పురస్కరించుకుని జనసేన ప్రచార రథాన్ని సిద్దం చేసింది. భారీ ఎత్తున దీని కోసం ఖర్చు పెట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో దీనిని తయారు చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది.
ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతన కలిగిస్తోందని జనసేన నాయకులు చెబుతున్నారు. మరోవైపు జూన్ 14 నుంచి ఏపీలో 23 వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని పార్టీ ప్రకటించింది. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాగం చేపట్టడంతో రాజకీయ, ఇతర వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. . పవన్ కళ్యాణ్ లక్ష్యాలు నెరవేరాలని మరియు రాబోయే సినిమాలు విజయం సాధాంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.