పవన్ కల్యాణ్ ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చూడని ఆసక్తికరమైన సీన్‌ను ఇప్పుడు అభిమానులు చూస్తున్నారు. అంత స్పెషల్ సీన్ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏముంది పవన్ కల్యాణ్ సినిమాలు వరుసగా సెట్స్ మీదకు రావడం.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వరుసగా విడుదల కావడం. పవన్ ఇన్నేళ్ల కెరీర్‌లో, పీక్ టైమ్‌లో కూడా ఇలా ఇన్నేసి సినిమాలు సెట్స్ మీద చూడలేదు. అయితే ఇన్నేసి సినిమాలు లైన్‌లో పెట్టడంతో ఓ సమస్య కూడా వచ్చింది. ఏ సినిమా ఎప్పుడు అనే విషయంలో రోజుకో వార్త బయటకు వస్తోంది.
విషయం క్లియర్‌గా చెప్పాలంటే… పవన్ కల్యాణ్ సినిమాలు ఏ ఆర్డర్ లో వస్తాయో ఎవరూ చెప్పలేరు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. పవన్ కల్యాణ్ కూడా చెప్పలేడు అంటున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ లైనప్‌లో సినిమాల ఆర్డర్ మరోసారి మారింది అంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘వినోదాయ చిత్తాం’ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకు మూడు వారాలే డేట్స్ ఇచ్చాడు. ఆ సినిమా అయిపోయిన వెంటనే మిగిలిన సినిమాలవైపు వస్తాడు అంటున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత లైనప్ ఏంటనేది అంతా కన్ఫ్యూజన్. ఎందుకంటే పవన్ కల్యాణ్ సినిమా లిస్ట్ అంటే ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ (వర్కింగ్ టైటిల్) ఉన్నాయి. ఇది కాకుండా సురేందర్ రెడ్డి – రామ్ తాళ్లూరి సినిమా ఉండాలి. ఆ సినిమా వెనక్కి వెళ్లింది అని అంటున్నారు. అయితే ఇప్పుడు అనుకున్న లైన్‌లో కాకుండా సినిమాలు లెక్క మారుతుంది అని చెబుతున్నారు.
సురేందర్ రెడ్డి సినిమా బదులు ఆ కాల్షీట్లను సుజీత్ సినిమాకు కేటాయించాడంటున్నారు. అంతేకాదు వచ్చే నెల నుండి పవన్ – సుజీత్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట.‘వినోదాయ చిత్తాం’ రీమేక్ పూర్తి చేసిన వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ షూటింగ్ ఒకేసారి మొదలుపెడతారు అని తాజాగా చెబుతున్నారు. అయితే ‘హరి హర వీరమల్లు’ ఎప్పుడు పూర్తవుతుంది అనేది కూడా తెలియాలి. అయితే ఇప్పుడు చెబుతున్న ఆర్డర్ ఇలానే ఉంటుందా? లేక మళ్లీ మారుతుందా అనేది చూడాలి.