పవన్ కల్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల ఆయన రెండు పడవలూ ఇబ్బంది పడుతున్నాయి. ఈ మాట అంటే ఆయన, ఆయన అభిమానులు ఒప్పుకోరు. రెండింటినీ బ్యాలన్స్ చేయడం పవన్‌కు బాగా తెలుసు అంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పే కొన్ని అంశాలు వింటే.. పవన్ రెండు పడవల ప్రయాణం నిర్మాతల పాలిట ఇబ్బందిగా మారింది మీరే ఒప్పేసుకుంటారు. దీని కోసం రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాలి.
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రేదశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు మహూర్తం ఖరారైంది. అక్టోబరు 5 విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించాలని నిర్ణయించారు. దసరా రోజున ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటిస్తారట. ఉమ్మడి జిల్లాలో బహిరంగసభలు నిర్వహిస్తారట. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నారట.
ఇదీ ఇటీవల జనసేన పార్టీ నుండి అధికారికంగా వచ్చిన సమాచారం. ఈ లెక్కన పవన్ కల్యాణ్ దగ్గర సినిమాలు చేయడానికి ఉన్న సమయం నాలుగు నెలలే. ఇంకా లెక్క గట్టి చెప్పాలంటే నాలుగున్నర నెలలు. మరి ఈ బ్యాలెన్స్ సమయంలో పవన్ మూడు సినిమాలు పూర్తి చేసేస్తాడా? ఇప్పుడు ఇదే ప్రశ్న పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ నుండి ఎదురవుతోంది. ఎంత వేగంగా షూటింగ్ పూర్తి చేసినా ఈ 135 రోజుల్లో మూడు సినిమాలు పూర్తి చేయడం కష్టం.
దీంతో పవన్‌ను నమ్ముకొని అడ్వాన్స్‌లు ఇచ్చి.. డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలకు పెద్ద తలనొప్పే వచ్చింది అని చెప్పొచ్చు. పవన్ చేతిలో ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌సింగ్’ ఉన్నాయి. తొలి సినిమా కొంతవరకు షూటింగ్ జరుపుకోగా, రెండో సినిమా ఇంకా మొదలవ్వలేదు. అయితే ఈలోపు ‘వినోదాయ చిత్తం’ అనే సినిమా రీమేక్ చేస్తారని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వకపోయినా సినిమా ఉందనేది మాత్రం అధికారిక పుకారు.
ఈ లెక్కన పవన్ సినిమాలు ఇప్పట్లో పూర్తవ్వడం కష్టం. అదేముంది అక్టోబరు నుండి ఆరు నెలలు పర్యటన జరిపి తిరిగి వచ్చి సినిమా చేస్తాడు అనుకోవచ్చు. అయితే ఏపీలో ఆ సమయంలో ఎన్నికలు ఉంటాయి అనేది ఇన్‌సైడర్ టాక్. సో పర్యటన తర్వాత కూడా పవన్ వెంటనే సెట్స్‌కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి సినిమాల సంగతేంటో పవనే చెప్పాలి.