సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసినప్పటికీ.. అది టీవీ షోల షూటింగ్ లకు,సీరియల్ షూటింగ్ లకు, చిన్న సినిమాలకు తప్ప పెద్ద సినిమాల షూటింగ్ లకు మాత్రం పనిచెయ్యడం లేదని స్పష్టమవుతుంది. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఇప్పట్లో షూటింగ్ లకు రాలేమంటూ తేల్చి చెప్పేసారు. రాజమౌళి కూడా ఇది సాధ్యం కాదు అన్నట్టు.. ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రయిల్ షూట్ ను క్యాన్సిల్ చేసాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అతను క్రిష్ డైరెక్షన్లో చెయ్యబోయే సినిమా షూటింగ్ కు హాజరుకాలేనని చెప్పేశాడట. కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగే కథతో దర్శకుడు క్రిష్.. పవన్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం షూటింగ్ పెద్ద ఎత్తున నిర్వహించాలట. పీరియాడికల్ నేపథ్యంలో సాగే కథ కాబట్టి.. ఈ చిత్రం షూటింగ్ కోసం పెద్ద ఎత్తున జన సమూహం మధ్యలో షూటింగ్ చెయ్యాల్సి ఉందని తెలుస్తుంది.
దాంతో దర్శకుడు క్రిష్ కు అలాగే.. ఈ చిత్రం నిర్మాత ఏ.ఎం.రత్నం కు.. ‘ఇప్పట్లో షూటింగ్ కు రాలేను’ అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశాడట. పవన్ కనుక బయటకు వస్తే పెద్ద ఎత్తున జనాలు షూటింగ్ స్పాట్ కు వస్తారు. అసలే ఇప్పుడు రోజులు బాలేదు కాబట్టి పవన్.. క్రిష్ సినిమాకు కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.