కరోనా పరిస్థితులు తగ్గేవరకు సినిమా షూటింగ్‌లు లేవు అని పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మీరూ ఆ వార్తల్ని చదివే ఉంటారు. అయితే సినిమా చిత్రీకరణల విషయంలో పవన్ మనసు మారిందని సమాచారం. అవును క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తున్నారట. దీని కోసం భారీ సెట్ రూపొందిస్తున్నారని సమాచారం. ‘హరి హర వీరమల్లు’ మొభల్‌కాలం నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే.
దీని కోసం ఇప్పటికే కొన్ని సెట్స్ రూపొందించి అందులో చిత్రీకరణ కూడా జరిపారు. తాజాగా సినిమా కోసం చాందినీ చౌక్‌సెట్‌ను రూపొందిస్తున్నారట. త్వరలో మొదలయ్యే షెడ్యూల్ చిత్రీకరణ అక్కడే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలోనే ఈ సెట్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. ఇటీవల అంటే కరోనా మూడో వేవ్ రాకముందు ఈ సినిమా కొత్త షెడ్యూల్ విషయమై పవన్ – క్రిష్ కలసి చర్చించారు. దీంతో చిత్రీకరణ కొత్త సంవత్సరంలో మొదలు అనుకున్నారు.
కానీ ఒక్కసారిగా దేశంలో పరిస్థితులు మారిపోయాయి. సినిమాల చిత్రీకరణ అంత సులభంగా జరిపే పరిస్థితులు లేకుండా పోయాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో షూటింగ్స్ అంటే ఇబ్బంది అనే పరిస్థితి వచ్చేసింది. అయితే ఎక్కడా చిత్రీకరణలపై ఆంక్షలు లేవు. ఎక్కువమంది హాజరు కావొద్దు అనే నిబంధనలు తప్ప. దీంతో పవన్ అందరి ఆరోగ్యాల గురించి ఆలోచించి చిత్రీకరణలు వాయిదా వేశారని వార్తలొచ్చాయి. అయితే త్వరలో కరోనా పరిస్థితులు కుదట పడొచ్చనే వార్తల నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ చిత్రీకరణల గురించి ఆలోచిస్తున్నారని అంటున్నారు.
సెట్ రూపొందించి అంతా ఓకే అనుకున్నాక తొలుత ఈ సినిమానే మొదలవుతుందట. ఇవికాకుండా పవన్ లైనప్‌లో ‘భీమ్లా నాయక్’, ‘భవదీయుడు భగత్ సింగ్’ ఉన్నాయి. వీటితోపాటు రామ్ తాళ్లూరి – సురేందర్ రెడ్డి సినిమా కూడా ఉంది. అయితే ఈ సినిమా మొదలవ్వాలంటే ముందు సురేందర్ రెడ్డి – అఖిల్ ‘ఏజెంట్’ పూర్తవ్వాలి. ఇవి కాకుండా దిల్ రాజు నిర్మాణంలో ఒకటి, భగవాన్ – పుల్లారావు నిర్మాణంలో ఒక సినిమా ఉందనే వార్తలూ వచ్చాయి.