పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం పక్కా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. ఇటీవలే తన ప్రచార రథం వారాహి వాహనానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పూజలు జరిపించారు. ఫిబ్రవరి 3న నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో సందడి చెయ్యబోతున్నారాయన. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానుంది.
పవన్, ‘సాహో’ సుజిత్ దర్శకత్వంలో చేయనున్న సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. ఇంకా 40 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దసరాకు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. అలాగే హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కమిట్ అయ్యారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితోనూ ఓ చిత్రం చేయాల్సి ఉంది.
అసలు పవన్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసేదెప్పుడు?.. అవి విడుదలయ్యేది ఎప్పుడు?.. కొత్తవి పట్టాలెక్కేదెప్పుడు? అంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారిలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ లెక్కన రోజుకి 48 గంటల టైమ్ సెట్ చేసినా సరిపోదు.. అంతలా ఆయన డైరీ నిండిపోయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.‘‘వారాహి ఒకవైపు వీరమల్లు ఒకవైపు.. పట్టాలెక్కాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకవైపు.. పట్టాలెక్కబోతున్న ‘వినోదాయ సీతం’ రీమేక్ ఒకవైపు,
పూజ పూర్తి అయిన ‘OG’ ఒకవైపు, సైన్ చేసిన సినిమాలు ఒకవైపు, రాబోతున్న ఎన్నికలు మరోవైపు.. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎటువైపు?’’ అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా స్పేస్‌లోనూ పవన్ ఫ్యాన్స్ మధ్య ఈ టాపిక్ గురించే డిస్కషన్ నడుస్తోంది. ‘భీమ్లా నాయక్’ విడుదలై ఏడాది కావస్తున్నా తమ అభిమాన నటుడినుండి కొత్త సినిమా రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.