కొత్త నటీనటులు, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత.. ఇలా అందరూ కొత్తవాళ్లతో రూపొందిన కాన్సెప్ట్ ఫిలిమ్ “పెదవి దాటని మాటొకటుంది”. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకొన్న ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. మరి ఈ కొత్తవాళ్ళ ప్రయత్నం ఏమేరకు ఫలించ్చిందో చూద్దాం..!!
కథ : తరుణ్ (రావన్ రెడ్డి)కి స్కూల్ & కాలేజ్ డేస్ లో అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అప్పట్లో మనోడు ఆల్మోస్ట్ మన్మధుడు అన్నమాట.. అమ్మాయిలందరూ నన్ను ప్రేమించు అంటే కాదు నన్ను అంటూ క్యూ కట్టేవారు. మనోడేమో మగజాతి ఆణిముత్యంలా ఆ ప్రపోజల్స్ అన్నీ రిజెక్ట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేసేవాడు. తీరా ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి సీన్ రివర్స్ అయ్యింది. సరైన చదువు లేకపోవడంతో తరుణ్ కి మంచి ఉద్యోగం దొరకదు, ఆఖరికి ఏ అవకాశం లేకపోవడంతో ఒక కంపెనీలో జానేటర్ (సాఫ్ట్ వేర్ కంపెనీలు, మల్టీప్లెక్స్ లలో బాత్ రూమ్ లు కడగడం, ఫ్లోర్ లు క్లీన్ చేసే స్పెషలిస్ట్)గా వర్క్ చేస్తుంటాడు.
తాను కాలేజ్ డేస్ లో మంచి ఫామ్ లో ఉండగా రిజెక్ట్ చేసిన అమ్మాయిల్లో ఒకరైన ఆహానా (పాయల్ వాద్వా) చిన్నప్పుడు జిడ్డు మొహంతో చిరాకెత్తేలా కనిపించినా.. పెద్దయ్యాక పాండ్స్ బ్యూటీలా తయారవుతుంది. సొ, మనోడు ఆమెను సైలెంట్ గా ఫాలో అవుతూ ఇంకా సైలెంట్ గా ప్రేమిస్తుంటాడు తప్ప తన ప్రేమను మాత్రం వ్యక్తపరచడు. తరుణ్ తన ప్రేమను ఆహానాతో చెప్పాలంటే చిన్న టెస్ట్ పాసవ్వాల్సి వస్తుంది. ఏమిటా టెస్ట్? ఆ టెస్ట్ లో తరుణ్ పాసయ్యాడా లేదా? అనేది “పెదవి దాటని మాటొకటుంది” సినిమా చూస్తే అర్ధమవుతుంది.
నటీనటుల పనితీరు : కథానాయకుడిగా తరుణ్, స్నేహితుడి పాత్రలో మొయీన్, తండ్రి పాత్రలో నరేష్, కథానాయిక పాత్రలో పాయల్ ఇలా అందరూ పాత్రకు అవసరమైన మేరకు మాత్రమే తమ నట ప్రతిభ కనబరిచి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు అందుకొంటే.. బంటీ అనే పాత్రలో నటించిన నందు కుమార్ మాత్రం నటించడం మానేసి “అతి” చేస్తూ.. ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారీ కథాగమనానికి అడ్డంకిగా మారడంతోపాటు.. ప్రేక్షకుల సహనాన్ని పారీక్షించాడు. ఫంకీగా ఉంటుందని దర్శకుడు భావించాడో లేక మిస్టర్ నందు కుమారే అలా నటించాడో తెలియదు కానీ.. కాస్తో కూస్తో బాగున్న సినిమాకి పెద్ద మైనస్ లా తయారయ్యాడు.
సాంకేతికవర్గం పనితీరు : జీనిత్ రెడ్డి సంగీతం, నమన్-యతిన్ ద్వయం సినిమాటోగ్రఫీ సినిమాలోని కంటెంట్ కి తగ్గట్లుగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. దర్శకుడు గురుప్రసాద్ కథ పరంగా పెద్దగా హోమ్ వర్క్ ఏమీ చేయలేదు, అలాగే కథనం విషయంలోనూ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. “క్యూపిడ్” అనే కాన్సెప్ట్ ను ఆడియన్స్ ను ఇంకాస్త క్లారిటీగా ఎక్స్ ప్లేన్ చేసి, హీరో & టీం ఆ క్యూపిడ్స్ గా ఎందుకు మారారు అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే సగంలో సగం మందైనా సినిమాకి కనెక్ట్ అయ్యేవారేమో.
ఈ క్యూపిడ్ ఏంటా అని బుర్ర గోక్కుంటున్నారా?.. గ్రీకు దేశంలో మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోయి, దాని బదులు కోపం, ఈర్ష్య వంటివి పెంచుకొంటున్న తరుణంలో ప్రేమ దేవత, యుద్ధ దేవుడు కలిసి పుట్టిన కుర్రాడే “క్యూపిడ్”. ఎక్కడ, ఎవరిలో అయితే ప్రేమ లోపిస్తుందో.. వారి మనసుకి ప్రేమ బాణం వేసి వారిలో ప్రేమ చిగురింపజేయడం ఆ క్యూపిడ్ పని. ఈ క్యూపిడ్ అనే జనాలకి పెద్దగా ఐడియా లేని కాన్సెప్ట్ ను కొత్త కాన్సెప్ట్ అనుకోని.. శేఖర్ కమ్ముల తరహాలో వైవిధ్యమైన గొంతులతో, సహజంగా సినిమా తీద్దామని గురుప్రసాద్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
విశ్లేషణ : న్యూ ఏజ్ సినిమా అనేసరికి కొత్తగా తీద్దామనే ప్రయత్నంలో ఫిలిమ్ మేకర్స్ షార్ట్ ఫిలిమ్ కి ఎక్కువ వెబ్ సిరీస్ కి తక్కువ లాంటి సినిమాలు తీసేసి జనాల మీదకి వదిలేస్తున్నారు. సినిమా తీయాలనే ప్యాషన్, ఫిలిమ్ మేకింగ్ పట్ల నాలెడ్జ్ తోపాటు.. కథ-కథనాలపై కాస్త పట్టు, సెన్సిబిలిటీస్ కూడా దర్శకుడికి కావాల్సిన లక్షణాలని ఈ కొత్త దర్శకులు ఎప్పుడు అర్ధం చేసుకొంటారో ఏమో.
రేటింగ్ : 1/5