శ్రీకాంత్ అడ్డాల,రావు రమేష్,నాగబాబు,అనసూయ,ఈశ్వరి రావు (Cast)
శ్రీకాంత్ అడ్దాల (Director)
మిర్యాల రవీందర్ రెడ్డి (Producer)
మిక్కీ జె. మేయర్ (Music)
చోటా కే నాయుడు (Cinematography)
Release Date : సెప్టెంబరు 23, 29
ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “పెదకాపు”. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బంధువైన విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ తోనే భీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడమే కాక.. విలన్ గానూ నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టైటిల్ కు కంటెంట్ జస్టిఫై చేసిందా? దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల ఫామ్ లోకి వచ్చాడా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!
కథ: రాజమండ్రి దగ్గరలోని ఓ గ్రామంలో కుల విద్వేషాలతో ప్రజలను పీడించుకు తినే రాజకీయ నాయకులు సత్య రంగయ్య (రావురమేష్), భైయన్న (నరేన్). ఈ ఇద్దరి దాష్టీకపు చీకటి నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రజలందరూ ఆలోచిస్తున్న తరుణంలో సీనియర్ ఎన్టీయార్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ వెలుగు రేఖలా కనిపిస్తుంది. 1982 ఎలక్షన్స్ లో నిలబడతాడు పెదకాపు (విరాట్ కర్ణ). సత్య రంగయ్య, భైయన్నలను ఎదుర్కొని, అక్కమ్మ (అనసూయ) సహాయంతో పెదకాపు ఎలా నిలదొక్కుకున్నాడు? తన వాళ్ళను ఎలా కాపాడుకున్నాడు? అనేది “పెదకాపు-1” కథాంశం.
నటీనటుల పనితీరు: విరాట్ కర్ణను తెరపై చూసినవారెవరూ డెబ్యూ హీరో అనుకోరు. చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా కథలోని ఎమోషన్స్ ను, పాత్రలోని భావాలను తెరపై పండించడంలో విజయం సాధించి, నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు విరాట్. డ్యాన్సుల విషయంలో మాత్రం ఈజ్ కనబడలేదు, కాస్త కష్టపడుతున్నాడు. అలాగే.. కామెడీ టైమింగ్ విషయంలో ఇంకాస్త డెవలప్ అవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ప్రగతి శ్రీవాత్సవ్ పల్లెటూరి పిల్లగా కనిపించడానికి, ఇమడడానికి కాస్త కష్టపడింది. మేకప్ తో మ్యానేజ్ చేసినా.. గోదావరి ప్రాంతం అమ్మాయిగా హావభావాల విషయంలో సింక్ అవ్వలేదు. రావు రమేష్ మరోమారు తన నట విశ్వరూపాన్ని చూపించారు. చుట్టూ వందమంది ఆర్టిస్టులున్నా.. తన నటనతో ఎలాంటి ఎలివేషన్స్ అవసరం లేకుండానే ఎలివేట్ అయ్యాడు రావు రమేష్. సినిమాకి మెయిన్ ఎస్సెట్ లో రావు రమేష్ పాత్ర అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తమిళ నటుడు నరేన్ కు కూడా మంచి పాత్ర లభించినప్పటికీ.. సరిగా మెప్పించలేకపోయాడు. శ్రీకాంత్ అడ్డాల నటించడానికి చాలా కష్టపడ్డాడు. అతడి ముఖంలో కోపం అనేది బలవంతంగా ఉంది కానీ నేచురల్ గా లేదు. అనసూయ ఓ ముఖ్యమైన పాత్రలో ఆకట్టుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన సేఫ్ జోన్ నుంచి బయటకి వచ్చి తెరకెక్కించిన సినిమా ఇది. స్క్రీన్ ప్లే విషయంలోనూ కొత్తదనం ప్రయత్నించాడు కానీ.. సినిమాకి అదే బెడిసికొట్టింది. ఈ తరహా కథలకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ముఖ్యం. అలాగే.. కానిఫ్లిక్ట్ పాయింట్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ రెండు విషయంలో శ్రీకాంత్ అడ్డాల తడబడ్డాడు. అనసూయ పాత్రకు ఇచ్చిన ప్రాముఖ్యత కొద్దిలోనే డిజాల్వ్ అయిపోయింది. రావు రమేష్ క్యారెక్టర్ ఆర్క్ చివరివరకూ కంటిన్యూ అవ్వలేదు. అయితే.. టెక్నికల్ గా మాత్రం సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది.
ఛోటా కె.నాయుడు సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడు. ఫైట్ సీన్స్ & మాస్ ఎలివేషన్ సీన్స్ చూసి షాక్ అయ్యేలా డిజైన్ చేశాడు ఛోటా. నైట్ షాట్స్ లో లైటింగ్ & డి.ఐ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. చాన్నాళ్ల తర్వాత ఛోటా బెస్ట్ వర్క్ గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. మిక్కీ పాటలు సోసోగా ఉన్నా.. నేపధ్య సంగీతంతో మాత్రం తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా జాతర సాంగ్ & ఎమోషనల్ & ఎలివేషన్ బీజీయమ్స్ భలే ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాత సినిమాకి అవసరమైన దానికంటే కాస్త ఎక్కువే ఖర్చు పెట్టాడు.
విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే ఓ మోస్తరుగా ఆకట్టుకునే సినిమా “పెదకాపు-1”. కానీ.. టైటిల్ చూసి ఏదో ఉంటుంది అని థియేటర్ కి వెళ్ళే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం కాస్త జాగ్రత్తపడాలి. విరాట్ కర్ణకు మంచి డెబ్యూ సినిమా ఇది. ఛోటా కె.నాయుడు కెమెరా వర్క్ కోసమైనా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.