2021లో దసరా కానుకగా విడుదలైన శ్రీకాంత్ కొడుకు రోషన్ మూవీ ‘పెళ్ళిసందD’ మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ ముందు నుండి పాటలు సూపర్ హిట్ అవ్వడం.. హీరోయిన్ లుక్స్ కూడా యువతని బాగా ఆకర్షించడంతో సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళు వచ్చాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర బయ్యర్స్ అంతా కూడా సేఫ్ అవ్వడమే కాకుండా లాభాలను కూడా ఆర్జించారు. నిజానికి ఈ చిత్రం విడుదలకు ముందు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయమని రూ.4.5 కోట్ల ఆఫర్ వచ్చింది.
‘పెళ్ళి సందD’ చిత్రం క్రేజ్ ఉండడం, పాటలు కూడా బాగుండడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే ఓటీటీ సంస్థలు ఈ చిత్రం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపాయి. కానీ అదే క్రేజ్ కలిసొస్తుందని మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ కు వెళ్లారు. వారి నమ్మకమే నిజమైంది. సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. పైగా సినిమా రిలీజ్ అయిన 6 నెలలకు ‘జీ’ వారి నుండి డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.7 కోట్ల ఆఫర్ వచ్చింది.
ఇక ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జూలై 17న జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అయ్యింది. మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ చిత్రం 8.62 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. బిజినెస్ పరంగా చూసుకుంటే ఇది మంచి టి.ఆర్.పి రేటింగ్ అనే చెప్పాలి. రోషన్ గత చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’ కి కూడా 8 పైనే టి.ఆర్.పి రేటింగ్ నమోదైంది. ఈ రెండు సినిమాలు బుల్లితెర పై మంచి సక్సెస్ సాధించినవే.
ఇంకా చెప్పాలి అంటే.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 8.25 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేస్తే దానికంటే కొంచెం ఎక్కువగా ‘పెళ్ళి సందD’ 8.62 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. రూ.350 కోట్ల బడ్జెట్ సినిమా కంటే కూడా రూ.6 కోట్ల బడ్జెట్ సినిమా బాగా పెర్ఫార్మ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.