‘అనగనగా ఒక రాజు’.. ఈ సినిమా ఇప్పటిది కాదు అనే విషయం మీకు తెలుసా? నాలుగున్నరేళ్ల క్రితం అంటే 2021 సెప్టెంబరులో ఈ సినిమాను సితార ఎంట్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా అనౌన్స్ చేశాయి. కల్యాణ్ శంకర్ ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు అని ప్రకటించారు. ఇప్పడు అంటే 2026 సంక్రాంతికి సినిమా విడుదలైంది. అయితే సినిమా మొదలైనప్పుడు ఉన్నవారిలో సినిమా రిలీజ్ అయినప్పటికి ఉన్న వారు ఇద్దరే అంటే మీరు నమ్ముతారా? వారే నిర్మాత నాగవంశీ, హీరో నవీన్ పొలిశెట్టి.
అలాంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎవరెవరు కష్టపడ్డారు అనేది తొలుత చూద్దాం. ఈ సినిమాకు మూల కథ అందించింది కల్యాణ్ శంకర్. అదేనండీ ‘టిల్లు’ సినిమాల ఫేమ్. ఆయన డైరక్షన్‌లో నవీన్ పొలిశెట్టి – శ్రీలీల కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయింది. అయితే ఆ తర్వాత నవీన్ ఓ యాక్సిడెంట్‌లో గాయపడటంతో సినిమా ఆగిపోయింది. ఆయన తిరిగి వచ్చాక మొదలుపెట్టేసరికి ఇటు హీరోయిన్ ఔట్, అటు డైరక్టర్ ఔట్. కానీ ఆయన కథ అలానే ఉండిపోయింది. అందుకే మూల కథ అని టైటిల్ కార్డ్ కూడా వేశారు.
ఆయన ఔటయ్యాక ప్రాజెక్ట్‌లోకి వచ్చిన మారి.. సినిమా రిలీజ్ టైమ్‌కి టీమ్‌తో లేరు. ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. ఏంటా అని ఆరా తీసేలోపు ఈ సినిమా కోసం స్పెషల్ టీమ్‌ని పెట్టుకుని నవీన్ పొలిశెట్టి కష్టపడ్డాడు అని నిర్మాత నాగవంశీ చెప్పారు. అనుకున్నట్లుగా సినిమా టైటిల్ కార్డ్స్‌లో కూడా ఆయన కష్టం గురించి రాసుకొచ్చారు. సినిమా డైరక్షన్, డైలాగ్స్ విషయంలో ఆయన, చిన్మయి ఘట్రాజు కలసి పని చేశారని ‘కో రైటర్ & క్రియేటివ్ డైరక్టర్’ అనే పేర్లు వేశారు. ఆఖరులో డైరక్టర్ మారి అని కూడా వేశారు. ఆ లెక్కన ఈ సినిమాను వండింది నలుగురు. అంతకుముందు ఈ సినిమా తమన్ సంగీత దర్శకుడు కాగా.. ఆ తర్వాత ఆయన స్థానంలో మిక్కీ జే మేయర్ రావడం గమనార్హం..
