పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పెట్టి చాలా ఏళ్లు అయింది. దాని మీద వరుస సినిమాలు తెరకెక్కించాలని ఆయన అప్పట్లో ప్లాన్స్ చేశారు. అయితే అవేవీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఇతర నిర్మాణ సంస్థలతో కలసి సినిమాలు చేసేందుకు ట్రై చేశారు. అవి కూడా పట్టాలెక్కలేదు. అయితే నితిన్ 25వ సినిమా ‘ఛల్ మోహనరంగా’తో ఇండస్ట్రీలోకి ప్రవేశించింది ఆ బ్యానర్. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో డీల్ గురించి అనౌన్స్ చేశారు.
ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు ఆ బ్యానర్ గురించి ఎందుకు అనుకుంటున్నారా? మరోసారి ఈ బ్యానర్‌ని పవన్ కల్యాణ్ బయటకు తీశారు. దీని కోసం ప్రత్యేకంగా ఎక్స్ పేజీని సిద్ధం చేశారు. అందులో కటానా, కెంజుట్సు గురించి, పవన్ కల్యాణ్ అందుకున్న గౌరవం గురించి వీడియోలు పోస్టు చేశారు. దీంతో దీని కోసమే ఈ పేజీ పెట్టారా అనుకున్నారంతా. అయితే ఆ పేజీ ఉద్దేశం అందులో వరుస సినిమాలు తీయడమే అని తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
యువ దర్శకులు, యువ హీరోలతో వరుస సినిమాలు చేసే ఆలోచనలో పవన్ ఉన్నారట. ఈ క్రమంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలసి 15 సినిమాలకు చేసిన ప్లాన్‌ను బయటకు తీశారు. దీని కోసం పవన్, పీపుల్ మీడియా విశ్వప్రసాద్ కలిశారు. త్వరలోనే ఆ ప్రాజెక్టుల్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కథలపై చర్చించడానికి అవకాశం కల్పించినందుకు పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు అంటూ టీజీ విశ్వప్రసాద్ ఓ ట్వీట్‌లో తెలిపారు కూడా.
ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ని అందించేందుకు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ కలయిక మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఈ ప్రయాణం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. మరి ఈ బ్యానర్ల కలయికలో ఎలాంటి సినిమాలు రానున్నాయి, ఎవరితో ఎవరు చేస్తారు అనేది చూడాలి.