పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. టాలీవుడ్‌లో బిజియెస్ట్ బ్యానర్ అని చెప్పొచ్చు. అలా పెద్ద సినిమాలను ఎలాంటి హడావుడి లేకుండా తీసే బ్యానర్ అని కూడా చెప్పొచ్చు. సినిమా మొదలైంది అనే విషయం కూడా చెప్పకుండా విడుదలకు రెడీ చేసేస్తుంటారు. కావాలంటే మీరే చూడండి ఇప్పుడు ఈ బ్యానర్ మీద పెద్దా చిన్నా సినిమాలు కలిపి మొత్తంగా 20 సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఆ 20 కాదు… త్వరలో రాబోతున్న ఒక్కటి. అయితే ఈ ఒక్కటి సినిమా కాదు బ్యానర్.
అవును, టాలీవుడ్‌లో మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ల తరహాలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా మరో బ్యానర్‌ను తీసుకొచ్చే పనిలో ఉందని టాక్. ప్రస్తుతం ఉన్న బ్యానర్, అందులో తెరకెక్కుతున్న సినిమాలను అలా కొనసాగిస్తూ… మరో బ్యానర్‌ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే ఈ బ్యానర్‌ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కాకుండా… ఆయన తనయ హ్యాండిల్ చేస్తారని అంటున్నారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలా డబుల్ బ్యానర్‌లు ఉన్న నిర్మాణ సంస్థలు మూడు ఉన్నాయి అని చెప్పాలి. గీతా ఆర్ట్స్ 2 అదేనండీ జీఏ2 గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా రోజుల క్రితమే పెట్టారు అల్లు అరవింద్. చిన్న సినిమాలను, దర్శకులను, యువ నిర్మాతలను ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చారు. ఇక దిల్ రాజు కూడా ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ స్థాపించి కూతురును నిర్మాతను చేశారు. మరోవైపు హారిక హాసిని క్రియేషన్స్‌కు కూడా సెకండ్ బ్యానర్ వచ్చింది.
అలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నుండి తక్కువ బడ్జెట్‌లో యంగ్ మేకర్లు, కొత్త నటీనటులను పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలనే ఆలోచన నడుస్తోంది. అలాగే ఓటీటీల కోసం కంటెంట్ తీస్తారట. మరి టీవీ షోలు కూడా దీని కిందకే వస్తాయా లేదా అనేది చూడాలి. అన్నట్లు ఈ నిర్మాణ సంస్థ నుండి 25 సినిమాలు అయిపోయాయి. ఆ ప్రొడక్షన్ హౌస్ హెడ్ టి.జి.విశ్వప్రసాద్ చెబుతున్న ప్రకారం అయితే.. త్వరలో 50 సినిమాలు చేసేస్తారట.