సినిమా ఓకే చేసిన తర్వాత… ఆ పాత్ర కోసం హీరోలు హోం వర్క్ చేస్తారు. ఆ పాత్రకు తగ్గట్టుగా ఎలా మారాలో ఆలోచిస్తారు, కసరత్తులు చేస్తారు. ఆఖరికి ఆ సినిమా స్టార్ట్ అయ్యేసరికి అందుకు తగ్గట్టుగా మారుతారు. అయితే ఇది కేవలం హీరోలకే కాదు, హీరోయిన్ల విషయంలోనూ ఉంటుంది అని చెబుతోంది పాన్ ఇండియా భామ పూజా హెగ్డే. తన పాత్రల విషయంలో రీసెర్చ్ చేస్తానని చెబుతోంది. దాంతోపాటు హీరోయిన్ల నెంబర్ రేస్ గురించి మాట్లాడింది.
టాలీవుడ్‌లో తొలి సినిమా ‘ముకుంద’ చేస్తున్నప్పుడు, చేసినప్పుడు నేను గ్లామర్ పాత్రలకు సూట్ అవ్వను అని కొంతమంది అన్నారు. అయితే ‘డిజే – దువ్వాడ జగన్నాథం’ ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. ఇప్పుడు గ్లామర్ పాత్రలకు పూజా బాగా కుదురుతుంది అని అంటున్నారు. ‘అరవింద సమేత’లో నా పాత్ర అరవిందకు సంగీతమంటే ఇష్టం. అందుకే ఆ సినిమాలో ఎక్కువగా హెడ్‌ఫోన్స్‌తోనే కనిపిస్తాను. చేతిపై మ్యూజిక్ సింబల్ టాటూ కూడా ఉంటుంది. నిజానికి ఇవేవీ స్క్రిప్ట్‌లో లేవు. ఆ పాత్ర కోసం ఇలా ఉంటే బాగుంటుందని అవన్నీ యాడ్ చేశా అని చెప్పింది పూజ.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ కథానాయిక నెంబర్ వన్, ఆమె నెంబర్ టూ అంటూ లెక్కలేస్తుంటారు. అలాంటి నంబర్ గేమ్‌ని పూజ ఎప్పుడూ పట్టించుకోదట. అశాశ్వతమైన ఆ ట్రెండ్‌లో ఉండాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చింది పూజ. దీంతో ఇదేంటి పూజ ఇప్పుడే వేదాంతం మాట్లాడుతోంది అనిపిస్తోందా? ఆమె మాటలు వింటుంటే అలా ఉంది. ఒక విధంగా ఆమె చెప్పిందీ నిజమే… ఈ నెంబర్ గేమ్‌లో ఎప్పుడేమవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక ‘పాన్ ఇండియా నటి’ అనే ట్యాగ్ గురించి ఏమంటారు అని అడిగితే…
నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. ప్రస్తుతానికి అయితే అన్ని భాషల్లో నటించాలి అనేది నా కోరిక అని చెప్పింది పూజ. ఎన్ని భాషల్లో నటించినా… తెలుగు సినిమాలంటేనే ఎక్కువ ఇష్టమట పూజకు. ఎందుకంటే ఆమె కెరీర్‌ను తీర్చిదిద్దింది, బిజీ ఆర్టిస్ట్‌గా మార్చింది టాలీవుడ్డే అని అంటోంది పూజ.