ప్రభాస్‌ను అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఫ్యాన్స్‌ని ఆయన కూడా అంతే ప్రేమగా డార్లింగ్ అనే పిలుస్తాడు. ఆ మాటకొస్తే దర్శకుల్ని, దగ్గర నిర్మాతల్ని, స్నేహితులైన నటుల్ని కూడా అలానే పిలుస్తుంటారు. అలాంటి ప్రభాస్‌కు తన హీరోల గురించి ట్యాగ్‌లైన్లు ఇవ్వమంటే ఎలాంటివి ఇచ్చాడో తెలుసా? ఒక్కోటి ఒక్కో జెమ్ అంతే. సినిమల్లోనే కాదు, బయట కూడా ఒక్క ముక్కలో ఆన్సర్‌లు ఇస్తా అని చెప్పకనే చెప్పాడు. మరి ఏ డైరెక్టర్‌కి ఎలాంటి పేర్లు ఇచ్చాడో చూస్తారా?
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక ఇటీవల జరిగింది. ఈ క్రమంలో ప్రభాస్‌ను హోస్ట్ సుమ కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ప్రభాస్ సరదాగా కొన్ని సమాధానాలు చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. వాటిలో ఒకటి దర్శకుల గురించి ప్రభాస్ చెప్పిన మాటలు. అవే ఒక్కో డైరెక్టర్‌కి ఇచ్చిన బిరుదులు.

తనతో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా తీసిన నాగ్ అశ్విన్ గురించి మాట్లాడుతూ స్ట్రాంగ్ అని చెప్పాడు ప్రభాస్. ఇక ‘సలార్’ సినిమా చేసిన ప్రశాంత్‌నీల్‌ను బ్యూటిఫుల్ పర్సన్ అని అన్నాడు డార్లింగ్. స్టార్ హీరోగా ఉన్న తనను పాన్ ఇండియా హీరోను చేసిన ఎస్‌ఎస్ రాజమౌళికి జీనియస్ గారు అని మెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘రాజా సాబ్’ తీసి స్టేజీ మీద ఎమోషనల్ కూడా అయిన మారుతిని క్యూట్ అని అన్నాడు ప్రభాస్.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మరో సినిమా ‘ఫౌజీ’ సినిమా దర్శకుడు హను రాఘవపూడిని వెరీ హార్డ్ వర్కింగ్‌గా కితాబిచ్చాడు ప్రభాస్. ‘బాహుబలి’ సినిమాలు తర్వాత మరో పాన్ ఇండియా సినిమా తీసిన యంగ్ డైరెక్టర్ సుజీత్‌కు స్మార్ట్ అనే బిరుదు ఇచ్చాడు. తన సినిమాలతో మనకు కొత్త ప్రభాస్‌ను పరిచయం చేసిన పూరి జగన్నాథ్‌ను జీనియస్ అని పొగిడేశాడు డార్లింగ్. ఇప్పుడు ‘స్పిరిట్’ అనే సినిమా తీస్తున్న సందీప్ రెడ్డి వంగా గురించి చెబుతూ కల్ట్ డైరెక్టర్ అని అన్నాడు.
