ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజా సాబ్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు మారుతి సినిమా టాక్ గురించి అలాగే అభిమానుల అసంతృప్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముందుగా అర్థరాత్రి 1:30 గంటలకు ప్రీమియర్ షోలు వేయడం వల్ల మీడియా మిత్రులకు కలిగిన అసౌకర్యానికి మారుతి క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో షో వేయడం వల్ల మైండ్ గేమ్ సరిగ్గా అర్థం కాలేదని, దాని ప్రభావం రివ్యూల మీద పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. తనలాంటి మిడ్ రేంజ్ దర్శకుడికి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మూడు ఏళ్ల కష్టాన్ని వెండితెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశామని వివరించారు.
సినిమా రిజల్ట్ ఒక్క రోజులోనే తేలదని, పండగ సెలవులు ఉన్నాయి కాబట్టి పది రోజులు ఆగితే పరిస్థితి తెలుస్తుందని మారుతి అన్నారు. సినిమాలో ఉన్న కొత్త పాయింట్ అర్థం కావడానికి ఆడియన్స్‌కు కొంత సమయం పడుతుందని, క్లైమాక్స్‌లో వచ్చే 40 నిమిషాల ఎపిసోడ్ పై ఇంటెలెక్చువల్ పీపుల్ నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు డిజప్పాయింట్ కాలేదని, కానీ పూర్తిగా సంతృప్తి చెందలేదని ఆయన గుర్తించారు.
ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్ ‘ఓల్డ్ గెటప్’ సినిమాలో లేకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. దీనిపై స్పందించిన మారుతి.. ఫ్యాన్స్ కోరిక మేరకు శనివారం సాయంత్రం 6 గంటల షో నుంచి ఆ ఓల్డ్ లుక్ సీన్స్‌ను జోడిస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ కొత్త ఎపిసోడ్ లో ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుందని, అలాగే లాగ్ అనిపించిన కొన్ని సన్నివేశాలను కూడా షార్ప్ చేశామని వెల్లడించారు. కొత్త వెర్షన్‌తో ఆడియన్స్ కచ్చితంగా సంతృప్తి చెందుతారని మారుతి ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్షన్స్ గురించి తనకు తెలియకపోయినా, కామన్ ఆడియన్స్ మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.
