ప్రభాస్ అంటే ఆరడుగుల కటౌట్ గుర్తొస్తుంది. అంతెత్తు ఉన్న నిండైన విగ్రహం అలా నడుచుకుంటూ వస్తే.. చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటుంటారు. ఈ మాట అభిమానులే కాదు, సగటు ప్రేక్షకులు కూడా చెబుతుంటారు. డార్లింగ్ అంటూ అందరూ అభిమానంగా పిలుచుకోవడంలో ఆ లుక్ కూడా ఓ కారణం అనుకోండి. అలాంటి ప్రభాస్ రాముడిగా మారితే చూడాలని చాలామంది అనుకున్నారు. దానిని ఓం రౌత్ ‘ఆదిపురుష్’తో తీరుస్తున్నారు. అయితే మరోవైపు ప్రభాస్‌ను రావణుడిని చేసే పనులు కూడా సాగుతున్నాయట.
‘ఆదిపురుష్’ సినిమా తర్వాత ప్రభాస్ – ప్రశాంత్ నీల్ మరోసారి కలసి పని చేస్తారని కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఆ సినిమా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై దిల్ రాజు స్పందించారు. ‘ఆదిపురుష్’ సినిమా ఇంకా విడుదల కాకముందే మరోసారి రామాయణంలోని మరో పాత్రతో మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారట. ఈ సినిమాకు ‘రావణం’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం.
రామాయణంలో రావణుడి పాత్ర ఆధారంగా ‘రావణం’ సినిమాలో ప్రభాస్ పాత్రని దర్శకుడు ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దారట. హీరో పాత్రను నెగిటివ్ కోణంలో చూపించి.. ఒక బ్యాడ్ వరల్డ్‌ను క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. ‘కేజీయఫ్’తో ఆయన ఈ పని చేసి చూపించారు. అలాంటి ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్‌ను ‘సలార్’లో విలనీ ఉన్న హీరోగా చూపించబోతున్నారు. ఆ తర్వాత కూడా అలాంటి ప్రయత్నం చేస్తారట.
రావణుడు అంటే రాక్షసుల రాజు.. లంకాధిపతి. మాహా బలవంతుడు అలాగే శివ భక్తుడు కూడా. అతనితో యుద్ధం అంటే దేవతలు సైతం భయపడేవారట. ఇదంతా నాణేనికి ఒవైపు. మరోవైపు రావణుడు గొప్ప మేధావి, శాస్త్రం గురించి బాగా తెలిసినవాడు. అయితే ధర్మాన్ని ధిక్కరంచడంతో ఇబ్బందులు పడతాడు. చివరకు రాముడి చేతిలో పరాజయం పాలవుతాడు. కానీ ప్రశాంత్ నీల్ చూపించే ‘రావణం’లో రావణుడు ధర్మాన్ని ధిక్కరించకపోతే ఎలా ఉంటాడు అనే పాయింట్‌ను చూపిస్తారు అని అంటున్నారు.