ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను చంపేందుకు కుట్ర జరిగినట్టు కర్ణాటక సిట్ పోలీసుల దర్యాప్తులో తెలియవచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు పాల్పడినవారే ఇందులో పాత్రధారులుగా ఉన్నారు. ఈ వివరాలను ప్రముఖ కన్నడ టీవీ ప్రసారం చేసింది. ప్రధాని మోదీ, బీజేపీని ప్రజా వేదికలపై ప్రకాష్ రాజ్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన్ను చంపేందుకు గౌరీలంకేష్ హత్యా నిందితులు పథకం వేసినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అంతేకాదు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ను కూడా అంతమొందించాలని కుట్ర పన్నినట్టు తెలిసింది. విచారణలో భాగంగా పోలీసులకు ప్రకాష్ రాజ్ ను చంపేయాలన్న పథకం గురించి గౌరీ లంకేష్ హత్య కేసు ప్రధాన నిందితుడు పరశురామ్ వాఘ్మోర్ తెలియజేశాడు. గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ప్రకటనలు చేయడమే దీనికి కారణంగా వాఘ్మోర్ తెలిపాడు.
అయితే, దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగానే స్పందించాడు. భిన్నమైన అభిప్రాయం కలిగిన వారిని చంపడం పరిష్కారం కానే కాదన్నాడు. ఈ విధమైన ఆలోచనలు విషపూరితమైనవిగా పేర్కొన్నాడు. తాను మతానికి వ్యతిరేకమైన ఏ ప్రకటనలు చేయలేదని, కాకపోతే మతాలను రాజకీయం చేయడాన్ని వ్యతిరేకించానని చెప్పాడు. తన స్వరాన్ని మూగబోయేలా చేద్దామనుకుంటున్నారని, ఇక మీదట మరింత బలంగా మారుతుందంటూ ట్వీట్ చేశాడు.