‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆ సినిమా విడుదలై రెండేళ్లు (వచ్చే సంక్రాంతికి) కావస్తున్నా, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు. దీనికి కారణం, ఈ మధ్యలో ఆయన ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డితో పాటు, పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్నారన్న వివాదంలో చిక్కుకోవడమే. ఈ ఆరోపణలు ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్మేలా చేశాయి. ఫ్యాన్స్ కూడా ఈ సీక్వెల్ అసలు ఉంటుందా, లేక ఈ గొడవలతో ఆగిపోతుందా అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Jai Hanuman
అయితే, ఈ వివాదంపై ప్రశాంత్ వర్మ తన వైపు నుంచి ఘాటుగానే స్పందించారు. తనకు రావాల్సిన వాటా (షేర్) గురించి, ఒప్పందాల గురించి ఒక సుదీర్ఘ ప్రెస్ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ తర్వాత ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఇరు వర్గాల మధ్య గొడవ సద్దుమణిగిందని, సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఇప్పుడు పూర్తి ఫోకస్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై పెట్టడానికి లైన్ క్లియర్ అయినట్లేనని సమాచారం.
ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త గాసిప్ చక్కర్లు కొడుతోంది. “జై హనుమాన్ షూటింగ్ 2026 నుంచి ప్రారంభం కానుందని, సరైన సమయం చూసి ప్రశాంత్ వర్మ అప్‌డేట్స్ ఇవ్వడం మొదలుపెడతారని” ప్రచారం జరుగుతోంది. నిర్మాతల గొడవ ఇంకా కొనసాగుతూ ఉంటే, షూటింగ్ గురించి ఇలాంటి వార్తలు బయటకు రావు. కాబట్టి, ఈ గాసిప్.. తెరవెనుక వివాదాలన్నీ “సెట్” అయ్యాయనడానికి ఒక సంకేతంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
‘జై హనుమాన్’ అనేది ప్రశాంత్ వర్మకు ఇప్పుడు అతిపెద్ద బాధ్యత. ‘హనుమాన్’ సృష్టించిన అంచనాలను అందుకోవాలంటే, ఆయన ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా స్క్రిప్ట్‌పై, ప్రీ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఈ గండం గట్టెక్కినట్లేనన్న టాక్ రావడంతో, ఆయన పూర్తి సమయం ‘జై హనుమాన్’ కోసమే కేటాయిస్తున్నారని తెలుస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ వివాదాలు సద్దుమణిగి, తమ డైరెక్టర్ మళ్లీ ఫామ్‌లోకి రావడం పట్ల హ్యాపీగా ఉన్నారు.
ఒకవేళ ఈ 2026 జనవరి షూటింగ్ స్టార్ట్ గాసిప్ నిజమైతే, సినిమా పోస్ట్ ప్రొడక్షన్, భారీ వీఎఫ్ఎక్స్ పనులన్నీ పూర్తి చేసుకుని థియేటర్లలోకి రావడానికి 2027 వరకు టైమ్ పడుతుంది. ఈ వివాదాల వల్ల సినిమా ఆలస్యమైనా, ‘హనుమాన్’కు మించిన అద్భుతాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.