ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దగ్గర చాలా కథలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఆయన కథలన్నీ సినిమాలుగా ఆయనే తెరకెక్కించడం ఇప్పట్లో పూర్తయ్యే పని కాదని ఆయనే ఓ సందర్భంలో చూఛాయగా చెప్పారు. అందుకే తన కథల్ని ఇతర దర్శకులకు ఇచ్చి సినిమాలు తీయిస్తున్నారు. అలా ఆయన మరో కథను వేరే దర్శకుడికి ఇచ్చేస్తున్నారా? అందులోనూ తన కెరీర్‌లో పెద్ద హిట్ అనిపించుకున్న సినిమాకు సీక్వెల్ కథనే ఇచ్చేస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
ప్రశాంత్ వర్మ కెరీర్‌లో అతి పెద్ద విజయం.. ఇంకా చెప్పాలంటే ఆయన పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయేలా చేసిన విజయం అందుకున్న చిత్రం ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy). అలాంటి కథతో తెలుగులో ఓ సినిమా రావడం అంటే ఆశ్చర్యం అనుకున్నారంతా ఆ సినిమా చూశాక. అంతలా ఆ సినిమాతో షాకిచ్చారు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత ‘హను – మాన్’ (Hanu man) అంటూ పాన్ ఇండియా లెవల్ విజయం అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన నుండి సినిమా రాలేదు.
కనీసం స్టార్ట్ కూడా అవ్వలేదు. ఈ క్రమంలో ‘జాంబీ రెడ్డి 2’ స్టార్ట్ చేస్తారనే వార్తలు వినిపించాయి. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ అవ్వడం పక్కా కానీ.. ఆయన దర్శకత్వంలో కాదు అని అంటున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద ‘జాంబీ రెడ్డి 2’ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా ఉంటుందని.. దీని కోసం నిర్మాత దాదాపు రూ.100 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు అని కూడా చెబుతున్నారు.
దీనికి తగ్గట్టే కాస్టింగ్ అండ్ క్రూ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను మాత్రమే అందిస్తారట. దర్శకత్వ బాధ్యతలు ఓ హిట్ వెబ్ సిరీస్ తీసిన దర్శకుడి చేతికి ఇస్తున్నారట. ప్రస్తుతం తేజ సజ్జా (Teja Sajja) ‘మిరాయ్’ (Mirai) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పనులు అయిన వెంటనే ‘జాంబీ రెడ్డి 2’ ఉంటుంది అని చెబుతున్నారు.