మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులోకి అదే పేరుతో రీమేక్ చేశారు. అక్కినేని నాగచైతన్య హీరోగా శృతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమమ్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గోపిసుందర్ సంగీతం అందించిన పాటలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. బ్యూటిఫుల్ లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ప్రేమమ్’ చిత్రం తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో ఒకసారి చూద్దామా!
కథ : విక్రమ్ అనే కుర్రాడి జీవితంలోని మూడు దశలలో చోటు చేసుకున్న ప్రేమ సంఘటనలే ఈ ‘ప్రేమమ్’. మొదట్లో టీనెజ్ వయసులో ప్రేమాయణం… ఆ తర్వాత కాలేజ్ వయసులో టీచర్ తో ప్రేమాయణం… ఆ తర్వాత చివరగా పెళ్లికి దారి తీసే ప్రేమాయణం. ఈ మూడు లవ్ స్టొరీలలో ఎలాంటి పరిస్థితులు, సంఘటనలు ఎదురయ్యాయి? చివరకు విక్రమ్ కు ఎలాంటి ప్రేమ దొరికింది? విక్రమ్ జీవితంలోకి వచ్చిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఏమయ్యారు? అనే అంశాలను వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది.
నటీనటుల పనితీరు : ఈ సినిమా నాగచైతన్యకు స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నటుడిగా చైతూ యాక్టింగ్ లో మంచి మెచ్యురిటీ కనిపించింది. ముఖ్యంగా చిన్న వయసులో ప్రేమికుడిగా కనిపించిన తీరు బాగుంది. ఇందుకోసం చైతూ చాలా హోం వర్క్ చేసినట్లుగా కనిపిస్తుంది. మూడు స్టేజ్ లలో లవ్ స్టొరీలలో చైతూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మొదటి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో దుమ్మురేపేసింది. అక్కడక్కడ మలయాళం ఫ్లేవర్ ఉన్నప్పటికీ తెలుగు యువతకి నచ్చే విధంగా బాగానే చేసింది.
తన క్యూట్ లుక్స్, హావభావాలు బాగా హెల్ప్ అయ్యాయి. ఇక రెండవ హీరోయిన్ గా శృతిహాసన్ అంతగా సెట్ కాలేకపోయింది. శృతిహాసన్ పాత్ర విషయంలో మరింత కేర్ తీసుకొని డిజైన్ చేసుంటే బాగుండేది. ఇక మూడవ హీరోయిన్ మడొన్నాసెబాస్టియన్ యాక్టింగ్ సూపర్బ్. తన స్మైల్, నటన, గ్లామర్ తో కట్టిపడేసింది. క్లైమాక్స్ లో బాగా అలరించింది. ఈ ముగ్గురు హీరోయిన్లతో చైతూ కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యింది. ఇక శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ ల కామెడి బాగుంది. మిగతా నటీనటులు వారి వారి పాత్రలలో బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడి ఎంటర్ టైన్ తో సాగిపోయింది. సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ తో పాటు కాస్త ఎమోషన్, మెచ్యురిటీని చూపించి మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు : ఈ సినిమాకు అందరూ టెక్నిషియన్స్ చాలా ప్లస్ అయ్యారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. సినిమా మూడ్ బాగా క్యారీ అయ్యేలా చూపించారు. ఇక గోపిసుందర్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. పాటలు విజువల్స్ పరంగా మరింత బాగున్నాయి. రీరికార్డింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ఇక దర్శకుడిగా చందు మొండేటి మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మరింత కొత్తగా డిజైన్ చేసి వుంటే బాగుండేది. చాలా వరకు సీన్స్ మలయాళం వర్షన్ లోనే బెటర్ అనే ఫీలింగ్ వచ్చేలా ఉన్నాయి. శృతిహాసన్ క్యారెక్టర్ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది.
ఇక చివరగా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు.
విశ్లేషణ : మలయాళం ‘ప్రేమమ్’ సినిమా చూడని వారికీ ఈ తెలుగు ‘ప్రేమమ్’ చాలా బాగా నచ్చుతుంది. కానీ మలయాళం వర్షన్ చూసిన వారికీ మాత్రం కాస్త నచ్చకపోవచ్చు. అయితే మొత్తానికి చైతూ మాత్రం తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడున్న యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పుకోవచ్చు.