మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. గతంలో ఈయన నటించిన ‘శివః పురం’ వంటి పలు సూపర్ హిట్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యేవి. అయితే తర్వాత వాటి సంఖ్య తగ్గిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈయన ఓ హీరోగా నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం ‘భీమ్లా నాయక్’ గా రీమేక్ అయ్యింది.
ఇక ఇతని దర్శకత్వంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ చిత్రం తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ అవుతుంది. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు టాలీవుడ్లో బాగా ఫేమస్ అయ్యింది అనే చెప్పాలి. ఇతను హీరోగా నటించిన ‘కడువా’ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా… రీమేక్ సినిమాల పై పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. “నా గత చిత్రం ‘జనగణమన’ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో రిలీజ్ అయ్యింది.
నా వరకు ఎక్కడో చోట పాన్ ఇండియా థియేటర్ రిలీజ్ ని మొదలుపెట్టాలి. అది ‘కడువా’ తో చేస్తున్నాను. భవిష్యత్ లో రీమేక్ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో ప్రతి పరిశ్రమ నుండి మల్టీ లాంగ్వేజ్ సినిమాలని రూపొందించడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. పెద్ద సినిమాలు కేవలం ఓటీటీ మీద ఆధారపడి బిజినెస్ చేసే పరిస్థితి ఉండదు. రాజమౌళి గారు బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఒక మోడల్ ని చూపించారు.
ఇండియా వైడ్ అన్ని భాషల్లో ఆ చిత్రాలు మెయిన్ స్ట్రీమ్ గా రిలీజ్ అయ్యాయి. ఈ మోడల్ ని అందరూ ఫాలో అవ్వాలి. కేజీఎఫ్ చిత్రం కూడా ఇదే మోడల్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా పెద్ద స్కేల్ సినిమాలు భవిష్యత్తులో అన్ని భాషల్లో థియేటర్ రిలీజ్ కావాలి. నేను ‘కడువా’ తో ఆ ప్రయత్నం చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.