సినిమాల్లో వారసత్వం కొత్తేమీ కాదు… సినిమాలు మొదలైన తొలి రోజుల్లో లేదు కానీ.. ఒక తరం తర్వాత చాలామంది వారసులే వస్తూ ఉన్నారు. తెలుగులోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఉంటూనే ఉంది. తండ్రి వారసత్వం, తల్లి వారసత్వం అంటూ కొత్త కుర్రాళ్లు సినిమాల్లోకి వస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం వాళ్లను ట్రోల్ చేస్తుంటారు. వాళ్ల వల్ల సినిమాల్లోకి ఇతరులు రావడం లేదని, వచ్చినా నిలవడం లేదని విమర్శిస్తుంటారు.
ఇలా విమర్శించడానికి వాళ్లు పెట్టే పేరు నెపో కిడ్స్. అలా అని చెప్పి వారసులు అందరూ విజయం సాధిస్తున్నారా? ఇతరులు రావడం లేదా? అంటే లేదనే చెప్పాలి. కానీ వారసుడు విజయవంతం అయితే నెపో కిడ్స్ అంటూ విమర్శలు ఎదుర్కొంటుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… ఆ ట్రోలర్స్ ఊపు తీసుకొచ్చేలా ప్రముఖ మలయాళ కథానాయకుడు, వాళ్ల మాటలో చెప్పాలంటే నెపో కిడ్ పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) మాట్లాడాడు. అలాగే వాళ్లకు బూస్టింగ్ కూడా ఇచ్చాడు.
ప్రముఖ నటుడు, నిర్మాత సుకుమారన్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు శ్రమించి నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. తాజాగా ‘ఆడు జీవితం’ (The Goat Life) అంటూ వచ్చి సక్సెస్‌ఫుల్ ప్రయోగాత్మక చిత్రం చేశాడు. ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ… దుల్కర్ సల్మాన్‌తో తనకున్న అనుబంధం, తమ మధ్య ఉన్న ఏకైక పోలిక గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటలు వైరల్ అయ్యాయి.
నాకు, దుల్కర్‌కి (Dulquer Salmaan) మధ్య ఉన్న పోలిక…నెపోకిడ్స్ అంటూ ఆ వర్గం ట్రోలర్స్‌కు స్టఫ్ ఇచ్చాడు. తాను సులభంగానే పరిశ్రమలోకి అడుగుపెట్టానని, ఇంటి పేరు చూసే తొలి అవకాశం అవకాశం ఇచ్చారని అన్నాడు. తొలి సినిమా కోసం స్క్రీన్ టెస్ట్ కూడా చేయలేదని చెప్పిన పృథ్వీరాజ్… తొలి సినిమా అవకాశం విషయంలో ఎప్పటికీ నా ఇంటి పేరుకు రుణపడి ఉంటానని చెప్పాడు.
ఈ విషయంలో బయటవాళ్లు ఎన్నివిధాలుగా మాట్లాడినా ఒక్కటే చెప్పగలను. బంధుప్రీతి కారణంగా తొలి సినిమాలో మాత్రమే అవకాశం ఇచ్చారు, ఇస్తారు కూడా. ఆ తర్వాత అవకాశాల కోసం మనమే శ్రమించాలి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అని పృథ్వీరాజ్ గుర్తు చేశాడు. అలా ట్రోలర్స్‌కి కౌంటర్ కూడా ఇచ్చాడు.