రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు.. డిప్యూటీ సీఎం అయ్యాక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లో ఏం తేడా వచ్చింది అని తెలియాలంటే ఈ రెండు ఫేజ్‌ల్లోనూ ఆయనతో కలసి పని చేసిన సినిమా టీమ్‌లు బాగా చెప్పగలుగుతాయి. ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాలను ఆయన రెండు ఫేజుల్లోనూ చేశారు. ఇటీవల ‘హరి హర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ విషయాలు చెప్పగా.. ఇప్పుడు ‘ఓజీ’ సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ చెబుతున్నారు. ‘ఓజీ’ సినిమా గురించి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
‘ఓజీ’ సినిమాతో ప్రియాంక అరుళ్ మోహన్ రెండున్నరేళ్లుగా ప్రయాణం చేశారు. ఈ సినిమాలో ఓజస్ గంభీర జీవితాన్ని మలుపు తిప్పే కణ్మణి పాత్రలో ప్రియాంక కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ సినిమా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇందులో బలమైన మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. దాని చుట్టూనే యాక్షన్ ఉంటుంది. 1980 – 1990లో ముంబయి నేపథ్యంలో సాగే కథ ఇది. గంభీరతో కణ్మణి ప్రేమలో పడటం, ఆ తర్వాత అతని జీవితం మలుపు తిరగడం ఈ సినిమాకి కీలకమని చెప్పారామె.
పవన్ కల్యాణ్ ఎలక్షన్స్‌లో గెలిచి, డిప్యూటీ అవ్వడానికి ముందు ఎలా ఉంది, గెలిచాక ఎలా ఉంది అని అడిగితే.. ఎన్నికల్లో గెలవడానికి ముందు ఆయన సెట్లో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవారని చెప్పింది ప్రియాంక. పుస్తకాలు చదువుకుంటూ కనిపించేవాళ్లని, సెట్‌కి వచ్చే పార్టీ సభ్యులతో మాట్లాడుతుండేవారని కూడా చెప్పింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక హ్యాపీగా ఉన్నారని, ప్రశాంతంగా, మరింత బాధ్యతగా కనిపిస్తున్నారని చెప్పింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారని కూడా చెప్పింది.
పవన్ కల్యాణ్ గురించి తాను బెంగళూరులో ఉన్నప్పుడే తెలుసని, ఆయనతో కలసి నటించాక తాను ఊహించిన దాని కన్నా ఇంకా ఎక్కువ క్రేజ్ ఉందని అర్థమైందని చెప్పింది. సెట్‌లో నేలపైనా, మెట్లపైనా కూర్చోడానికి ఇష్టపడతారని చెప్పింది. సెట్లో ఆయనలా కింద కూర్చుంటే తానూ వెళ్లి పక్కనే కింద కూర్చునేదానినని చెప్పింది.