భారతదేశంలో సౌందర్య ఉత్పత్తులు వాడటం, వాటి ప్రచారం రెండూ ఎక్కవ అంటుంటారు పరిశీలకులు. చామనఛాయ ఉన్న వాళ్లు ఎక్కువగా ఉండటంతో ముఖానికి క్రీమ్, పౌడర్ రాయడం చిన్నతనం నుంచే అలవాటు అయిపోతుంటుంది. దీనికి యాడ్స్ కూడా ఓ కారణం అనే విషయం తెలిసిందే. టీవీ ఆన్ చేస్తే… నేను రెండు వారాల్లో ఇంత తెల్లగా మారిపోయాను అంటూ కథానాయికలు, మోడళ్లు యాడ్‌లు ఇస్తుంటారు. దీంతో మనం కూడా అలా మారిపోతాం అంటూ అమ్మాయిలు బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. అయితే దీనిపై ఇటీవల విపరీతమైన చర్చ మొదలైంది. ఇలాంటి యాడ్స్ వర్ణవివక్షను పెంచేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ప్రియాంక చోప్రా స్పందించింది.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ వరుస సినిమాలు చేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రియాంక చోప్రా. అంతేకాకుండా వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తూ బిజీగా ఉంటూ వచ్చింది. అయితే ఆ విషయంలో పశ్చాత్తాప పడుతున్నట్లు ప్రియాంక అంది. శరీర సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తులను ప్రచారం చేసినందుకు బాధపడుతున్నట్లు తెలిపింది. ప్రియాంక బ్యూటీ ప్రోడక్ట్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించే సమయంలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే హాలీవుడ్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత ప్రియాంక… బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రచారానికి దూరంగా ఉంటోంది.
‘‘దక్షిణాసియాలో సౌందర్య ఉత్పత్తులు వాడటం సర్వసాధారణమైన విషయం. ఆ దేశాల్లో అదొక పెద్ద పరిశ్రమ. చాలామంది ఆ ఉత్పత్తులు వాడటానికి ఇష్టపడతారు. మహిళా నటులు అయితే… వాడటం తప్పనిసరి అనే పరిస్థితి. చిన్న తనంలో చామనఛాయలో ఉండేదాన్ని. ముఖానికి క్రీమ్, పౌడర్ రాసుకోవడంతోనే అందంగా కనిపిస్తాననే భావన ఉండేది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలి రోజుల్లో అందంగా లేనన్న విమర్శలు వచ్చాయి’’ అంటూ తన మేని ఛాయ గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక.
బ్యూటీ ప్రోడక్ట్స్ విషయంలో గతంలోనూ ప్రియాంక స్పందించింది. ‘‘నా తోబుట్టువులు అందరూ అందంగా ఉండేవారు. నేను చామనఛాయతో తక్కువ రంగులో ఉండేదాన్ని. ఇంట్లో వాళ్లందరూ సరదాగా ‘కాళి.. కాళి’ అని పిలిచేవారు. అప్పుడు నాకు 13 ఏళ్ల వయసుంటుంది. అప్పుడే ముఖానికి క్రీమ్, పౌడర్ రాయడం మొదలు పెట్టా’’ అంటూ తన బ్యూటీ ప్రోడెక్ట్స్ వినియోగం గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక. అంటే అప్పుడు ప్రారంభించి… ఇప్పుడు వాటి వినియోగం, ప్రచారం గురించి బాధపడుతోంది ప్రియాంక. ఎంతమంది అమ్మాయిలు ఈ మాట వింటారో మరి.