మలయాళ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఒకప్పుడు చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం అందుకునేవి. చిన్న నటులు కూడా పరిశ్రమ మెచ్చుకోదగ్గ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు, తెప్పించారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కాస్టింగ్ కౌచ్ మీద జస్టిస్ హేమ కమిటీ నివేదిక వచ్చింది. అందులో ఎవరూ నమ్మలేని, ఒప్పుకోని విషయాలు బయటికొచ్చాయి. ఆ తర్వాత నటులు, సినిమా టీమ్‌ల మీద నటీమణులు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆ సంగతి తేలకుండానే డ్రగ్స్ విషయం బయటికొచ్చింది. ఏకంగా డ్రగ్స్ కోసం ప్రత్యేకమైన రూమ్స్, బడ్జెట్ ఉంటోంది అని ఓ మహిళా నిర్మాత ఆరోపించారు. కేరళ సినిమా వర్కర్స్ నిరసననలు, జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేసి సంచలనంగా మారిన సాండ్రా థామస్ (Sandra Thomas) గుర్తున్నారా? ఆమె ఆరోపణల కారణంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి, ఆమెను నిర్మాతల సంఘం నుండి సస్పెండ్ చేశారు కూడా. ఇప్పుడు మరోసారి ఆమె మాట్లాడారు.
డ్రగ్స్ కోసం మలయాళ సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు సపరేట్ బడ్జెట్ పెడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు రూమ్స్ కూడా సెట్ చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. 1991లో సాండ్రా థామస్ నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ‘నెట్టిపట్టం’ అనే సినిమాతో ఆమె నటన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘ఫ్రైడే’ అనే సినిమాతో నిర్మాతగా మారారు. మోహన్ లాల్ (Mohanlal) ‘పెరుచాళి’కి కూడా ఆమెనే నిర్మాత. ఇండస్ట్రీతో అంత సంబంధం ఉన్న ఆమె తాజాగా ఒక మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే పై విషయాలన్నీ చెప్పుకొచ్చారు.
మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం మీద దృష్టి సారించాలి. చిత్రీకరణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు అని అన్నారామె. లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్న ‘బేబీ గర్ల్’ సినిమా చిత్రీకరణలో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ తన రూమ్‌లో గంజాయి తీసుకుంటూ దొరికాడు. నేను ఒకేసారి నాలుగు సినిమాలు నిర్మిస్తుంటాను. ఎవరు ఏ సెట్‌కు ఏం తీసుకొస్తున్నారో నాకెలా తెలుస్తుంది. డ్రగ్స్ వాడుతున్న వాళ్లను సస్పెండ్ చేయడం మంచిది అని లిస్టిన్ స్టీఫెన్ అన్నారు. ఈ విషయాన్ని సాండ్రా (Sandra Thomas) మళ్లీ ప్రస్తావించారు.