అక్కినేని నాగార్జున (Nagarjuna) కెరీర్ ప్రారంభంలో లవ్ స్టోరీలు ఎక్కువగా చేశారు. వాస్తవానికి యాక్షన్ సినిమాలతో కెరీర్ ప్రారంభించారు కానీ అవి అంతగా కలిసి రాలేదు.దీంతో అతని తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రేమకథలు చేశారు. సక్సెస్ లభించింది. నాగార్జున అందగాడు పైగా పక్కింటి కుర్రాడు తరహా పాత్రలు చేయడం వల్ల… ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఓన్ చేసుకున్నారు. ఇలాంటి టైంలో ‘హలో బ్రదర్’ (Hello Brother) ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ ‘అల్లరి అల్లుడు’ వంటి సినిమాలు చేయడంతో మాస్ ఆడియన్స్ కూడా బాగా ఓన్ చేసుకున్నారు.
అలా నాగ్ క్లాస్, మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఓ పక్క మాస్ సినిమాలు చేసినా క్లాస్ సినిమాలు చేయడం మానేవారు కాదు. 1996 లో ‘నిన్నే పెళ్ళాడతా’ (Ninne Pelladata) అనే ఫ్యామిలీ సినిమా చేసిన నాగార్జున.. ఆ సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నిర్మాతగా కూడా నాగార్జునకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ‘అన్నమయ్య’ (Annamayya) అనే సినిమా చేశారు నాగార్జున.
లవర్ బాయ్- యాక్షన్ ఇమేజ్ ఉన్న నాగ్ తో కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) గారు చేసిన ప్రయోగాత్మక సినిమా ఇది అనుకోవాలి.నాగార్జునకి కథ చెప్పడానికి కూడా కె.రాఘవేంద్రరావు చాలా భయపడ్డారట. ‘ఈ సినిమా ఆడుతుంది అని నేను చెప్పను కానీ కచ్చితంగా నీకు అవార్డు తెచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పేసి పక్క రూమ్ కి వెళ్లిపోయారట. ఆ తర్వాత వెళ్లి కథ విన్నాక నాగార్జున కళ్ళు ఎర్రగా అయిపోయాయని ఆయన చెప్పారు.
అలా ఇమేజ్ పక్కన పెట్టి నాగార్జున ఆ సినిమా చేశారట. మొదట్లో ఆ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. 4 వారాల వరకు థియేటర్లలో ఎవ్వరూ లేరు. ప్రమోషన్స్ కూడా చేసి చేసి విసిగిపోయి ఆపేశారు. కానీ తర్వాత నుండి ఎవ్వరూ ఊహించని విధంగా హౌస్ ఫుల్ బోర్డులతో సినిమా కళకళలాడిపోయింది. ఈ సినిమాకి గాను స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నేషనల్ అవార్డు వచ్చింది నాగార్జునకి..!