ఒక కుటుంబంలో ఒక విషాదం జరిగినప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.. అదే ఆ సంఘటన మరవక ముందే మరో సంఘటన జరిగితే ఆ కుటుంబం ఏ స్థితిలో ఉంటుందో మనం చూస్తున్నాం.. అలాంటి సంఘటనే ఈరోజు సినీ పరిశ్రమలో జరిగింది.. ఒక వైపు సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో టాలీవుడ్ విషాదఛాయలు ఏర్పడ్డాయి.. ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అయితే చంద్రమోహన్ మరణ వార్తతో విషాదంలో ఉన్న తెలుగు పరిశ్రమను మరో విషాద వార్త వెంటాడింది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు (55), హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. శనివారం మధ్యాహ్నం మరణించారు. నిర్మాత యక్కలి రవీంద్ర బాబు శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో కలిసి ‘సొంత ఊరు, గంగపుత్రులు’ వంటి అవార్డు చిత్రాలతో పాటు..
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా దాదాపు 17 చిత్రాలను నిర్మించారు.. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం భాషలలో కూడా నిర్మాత యక్కలి రవీంద్ర బాబు చిత్రాలను నిర్మించారు. ఆయనకు భార్య రమాదేవి.. ఒక కుమార్తె (ఆశ్రీత), కుమారుడు (సాయి ప్రభాస్) ఉన్నారు. నిర్మాతగానే కాకుండా గీత రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చాటారు.
‘హనీ ట్రాప్, సంస్కార కాలనీ, మా నాన్న నక్సలైట్’ వంటి పలు చిత్రాలలో హృద్యమైన సాహిత్యం అందించిన సాహితి అభిలాషి అతను. యక్కలి రవీంద్ర బాబు (Ravindra Babu) మరణ వార్త తెలిసిన టాలీవుడ్.. ఆయనకు నివాళులు అర్పిస్తోంది.